Mamata Banerjee: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

  • బీజేపీ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ముర్ము ప్రస్తావన తెచ్చిన బెంగాల్ మంత్రి అఖిల్
  • అఖిల్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు 
  • ముర్ముకు క్షమాపణలు చెప్పిన మంత్రి 
  • పార్టీ తరఫున క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ
West Bengal CM Mamata Banerjee says sorry to president draupadi murmu

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోమవారం మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. దీదీ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న తృణమూల్ నేత అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూపాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

ఫలితంగా సోమవారం మరో ప్రకటన చేసిన అఖిల్ గిరి... రాష్ట్రపతిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. బీజేపీ నేతలు నిత్యం తన రూపంపై విమర్శలు గుప్పిస్తుంటే... తాను అలా అన్నానని, అయినా తాను చేసింది తప్పేనంటూ ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం మరింత ముదురుతుందని గ్రహించిన దీదీ స్వయంగా రంగంలోకి దిగారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని దీదీ అన్నారు. అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరఫున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తన కేబినెట్ మంత్రిని హెచ్చరించారు.

More Telugu News