Andhra Pradesh: అమరావతి, రాష్ట్ర విభజనపై విడివిడిగానే విచారణ... ఈ నెల 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో 8 పిటిషన్ల దాఖలు
  • రాష్ట్ర విభజనపై 28 పిటిషన్లు దాఖలైన వైనం
  • అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్ ధర్మాసనం
  • తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు
  • ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేను తదుపరి విచారణలో పరిశీలిస్తామన్న న్యాయమూర్తులు
supreme court adjourns hearing on petitions of amaravati and state bifurcation

ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న రాజధాని రైతుల పిటిషన్లకు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ పలు సంస్థలు, వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విభజనపైనా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్ ధర్మాసనం వాటిపై విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కేకే వేణుగోపాల్, వైద్యనాథన్ లు... రాష్ట్ర రాజధాని, రాష్ట్ర విభజనలపై దాఖలైన పిటిషన్లను వేర్వేరుగానే విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టులో ఏపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారని, ఈ నేపథ్యంలో రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరారు. ఈ సమయంలో కల్పించుకున్న న్యాయమూర్తులు... ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే దాకా హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాజధాని, రాష్ట్ర విభజనలపై వేర్వేరుగానే విచారణ చేపడతామని తెలిపారు.

ఈ పిటిషన్లపై ఈ నెల 28న తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఏపీ రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలా? వద్దా? అన్న విషయంపైనా తదుపరి విచారణలోనే దృష్టి సారించనున్నట్లు కూడా కోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే... రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో 8 పిటిషన్లు దాఖలు కాగా... రాష్ట్ర విభజనపై ఏకంగా 28 పిటిషన్లు దాఖలయ్యాయి. 

More Telugu News