Kalva Srinivasulu: జగనన్న కాలనీలు జనావాసాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం అసాధ్యం: కాల్వ శ్రీనివాసులు

  • ఏపీలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణాలపై కాల్వ ప్రెస్ మీట్
  • జూమ్ యాప్ ద్వారా మాట్లాడిన టీడీపీ నేత
  • జగనన్న కాలనీల్లో నేటికీ మౌలిక వసతుల్లేవని ఆరోపణ
Kalva Srinivasulu take dig at YCP Govt

ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ఇల్లు లేని ప్రతి పేదవాడికి నవరత్నాలు అనే పథకం కింద 5 సంవత్సరాల్లో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఊదరగొట్టారని విమర్శించారు.  

ఈ మూడున్నర సంవత్సరాల్లో  ఈ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేసిన ఇళ్లు  60 వేలు కూడా లేవని తెలిపారు. మిగిలిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల హడావుడిలో అధికార యంత్రాంగం ప్రజలు పక్కా గృహాల పథకానికి అంతగా శ్రద్ధ పెట్టే అవకాశంలేదని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మిగిలిన ఈ పది నెలల కాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం ఎలా సాధ్యమో తెలపాలని డిమాండ్ చేశారు.

"28,30,000 మంది ఇళ్లులేని పేదలుంటే 80 వేల ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. 2019-20 బడ్జెట్ లో రూ.3,600 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది రూ.760 కోట్లు మాత్రమే. 2020-21లో రూ.3,690 కోట్లు కేటాయించి 1,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 

జగనన్న కాలనీలు జనావాసాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం అసాధ్యం. ఎక్కడో జనావాసాలకు దూరంగా 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలు ఉన్నాయి. జగనన్న కాలనీల్లో జీవనం సాగించలేము. ఊరికి దూరంగా ఉండే ఈ కాలనీల్లో నేటికీ నీటి సదుపాయం లేదు. ఎక్కడా రోడ్లు లేవు. ఒక్కొక్క ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలన్నా దాదాపు రూ.5 లక్షలు కావాలి. లబ్దిదారులు సమకూర్చుకోలేక సతమతమౌతున్నారు. 

జగన్ సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలంలో అభిరుచులకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకోమని జగన్ ప్రభుత్వం చెబుతోంది. డిజైన్లు ఇచ్చి ఆ డిజైన్ లో మాత్రమే ఇళ్లు నిర్మించుకోవాలంటున్నారు. సెంటు స్థలంలో ఆ వెసులుబాటు ఎక్కడుంటుందో చెప్పాలి. 

మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తప్ప ఈ పేదల ఇళ్లనిర్మాణ పథకం ముందుకు వెళ్లే అవకాశమే లేదు. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం గృహ నిర్మాణ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తాం" అని పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు వివరించారు.

More Telugu News