metro: పెరగనున్న మెట్రో ఛార్జీలు.. త్వరలోనే అమలు!

  • ప్రజాభిప్రాయ సేకరణకు ఈ నెల 15తో ముగుస్తున్న గడువు
  • మంగళవారం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సమావేశం
  • అభ్యంతరాలు, సూచనలపై చర్చించనున్న కమిటీ
  • ఆపై చార్జీల సవరణపై ఎల్ అండ్ టీకి ప్రతిపాదనలు
 Officials say that Hyderabad Metro train fares will increase

ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకునేందుకు తరచుగా మెట్రోలో ప్రయాణిస్తుంటారా.. త్వరలో మీ ప్రయాణ ఖర్చు ఇంకాస్త పెరగొచ్చు. ఎందుకంటే మెట్రో చార్జీలు పెరగబోతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి మెట్రో చార్జీల్లో మార్పులేదు. ప్రస్తుతం ఈ చార్జీలను సవరించాలని మెట్రో నిర్ణయించింది. చార్జీల సవరింపునకు ప్రజలు, ప్రయాణికులు ఇతర వర్గాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ కమిటీని కూడా రూపొందించింది. ఈ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను, అభ్యంతరాలను స్వీకరించి మెట్రో చార్జీల పెంపుపై నివేదిక అందజేస్తుంది. 

అందులో సూచించిన అంశాల ఆధారంగా చార్జీల సవరణ చేపట్టాలని మెట్రో నిర్ణయించింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ పెట్టిన గడువు ఈ నెల 15 తో ముగియనుంది. ఇందులో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా చార్జీల పెంపు ఏమేరకు ఉండాలనేది కమిటీ ప్రతిపాదించనుంది. కొత్త ఏడాది నుంచే పెరిగిన చార్జీలు అమలులోకి రావొచ్చని అధికారవర్గాల సమాచారం.

సిటీలో ప్రస్తుతం ఎల్బీ నగర్ –మియాపూర్, రాయదుర్గం –నాగోల్, ఎంజీబీఎస్ –జేబీఎస్ మార్గాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కరోనా లాక్ డౌన్, వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా మెట్రో సర్వీసులు కొంతకాలం నిలిచిపోయాయి. కరోనా ప్రభావం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న మెట్రో ఇప్పుడిప్పుడే పునర్ వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజూ ల‌క్షలాది మందిని గమ్యం చేర్చే మెట్రోలో చార్జీల సవరణకు సమయం వచ్చిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు.

More Telugu News