England: టీ20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్... ఫైనల్లో పాకిస్థాన్ కు నిరాశ

  • ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం
  • మరో ఓవర్ మిగిలుండగానే కప్ కొట్టేసిన బట్లర్ సేన
  • పోరాడి ఓడిన పాక్
  • గాయంతో వైదొలగిన షహీన్ అఫ్రిది
  • విజేత ఇంగ్లండ్ కు రూ.12.88 కోట్ల ప్రైజ్ మనీ
England wins T20 World Cup by beating Pakistan

జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్ లో నేడు జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. ఈ స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో బట్లర్ సేన మరో ఓవర్ మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అర్ధసెంచరీతో ఇంగ్లండ్ ను ప్రపంచ విజేతగా నిలిపాడు. 

పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది గాయంతో బౌలింగ్ మధ్యలోనే వైదొలగడం పాక్ అవకాశాలను దెబ్బతీసింది. ఓ క్యాచ్ పట్టే యత్నంలో అఫ్రిది గాయపడ్డాడు. అయితే, ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఒక బంతి వేసిన అఫ్రిది మోకాలి నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. 

ఆ ఓవర్ ను ఇఫ్తికార్ అహ్మద్ పూర్తిచేయగా, అతడి బౌలింగ్ ను ఇంగ్లండ్ ఆటగాళ్లు చితకబాదారు. ఆ ఓవర్లో మొత్తం 13 పరుగులు రాగా, ఇంగ్లండ్ కు అదే టర్నింగ్ పాయింట్ అయింది. అక్నడ్నించి సాధించాల్సిన రన్ రేట్ తగ్గిపోవడంతో ఇంగ్లండ్ జట్టు అలవోకగా నెగ్గింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 52 (నాటౌట్), కెప్టెన్ జోస్ బట్లర్ 26, హ్యారీ బ్రూక్ 20, మొయిన్ అలీ 19 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, షహీన్ అఫ్రిది 1, షాదాబ్ ఖాన్ 1, మహ్మద్ వసీమ్ జూనియర్ 1 వికెట్ తీశారు. 

ఈ టైటిల్ సమరంలో పాకిస్థాన్ జట్టు చివరికంటా పోరాడింది. కానీ స్వల్ప లక్ష్యం కావడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. కాగా, వరల్డ్ కప్ విన్నర్ హోదాలో ఇంగ్లండ్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.12.88 కోట్ల నగదు బహుమతి కూడా అందనుంది. 

2019లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లీష్ జట్టు, ఇప్పుడు 2022లో టీ20 వరల్డ్ కప్ ను కూడా ఇంటికి తీసుకెళుతోంది. ఇంగ్లండ్ జట్టుకు ఇది రెండో టీ20 ట్రోఫీ. ఆ జట్టు 2010లోనూ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

More Telugu News