Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై దాడికి యత్నం

  • మానకొండూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రసమయి
  • గన్నేరువరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దీక్షలు చేస్తున్న యువకులు
  • ఆగకుండా వెళ్లిపోతున్న రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నం
  • యువకులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులు
youth wings try to attack trs mla Rasamayi Balakishan

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొందరు యువకులు బాలకిషన్ కాన్వాయ్ పై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బాలకిషన్ కు ఎలాంటి గాయాలు కాకున్నా... ఏకంగా ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడికి యత్నం జరగడంతో గుండ్లపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బాలకిషన్... ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో గన్నేరువరం మండల కేంద్రంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డుతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కొంతకాలంగా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళుతున్న రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే రసమయి తన కాన్వాయ్ ని ఆపకుండానే ముందుకు సాగారు.

దీంతో కనీసం తమకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నించారు. రసమయి కాన్వాయ్ ని కొంతదూరం వరకు వెంటాడిన యువకులు కారుపై దాడికి యత్నించారు. అయితే పరిస్థితిని గమనించిన పోలీసులు యువకులపై లాఠీ చార్జీ చేసి రసమయి కాన్వాయ్ ముందుకు వెళ్లేలా చేశారు. అనంతరం గన్నేరువరం పోలీస్ స్టేషన్ చేరుకున్న బాలకిషన్... తనపై దాడికి యత్నించిన యువకులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

More Telugu News