pets: పెంపుడు కుక్క కరిస్తే పదివేలు ఫైన్.. ఎక్కడంటే!

  • ప్రేమొక్కటే సరిపోదు బాధ్యత కూడా ఉండాలి
  • పెంపుడు జంతువుల యజమానులకు నోయిడాలో కొత్త గైడ్ లైన్స్
  • రిజిస్ట్రేషన్ చేయించకపోతే నెలనెలా రూ.2 వేలు జరిమానా
Noida authority declares fines on registration failure

పెంపుడు జంతువులపై ప్రేమ చూపితే సరిపోదు.. వాటి విషయంలో బాధ్యత కూడా ఉండాలని నోయిడా అధికార యంత్రాంగం పేర్కొంది. నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలతో ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నెలనెలా రూ. 2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అదేవిధంగా.. ఇంట్లో మీరు ప్రేమగా పెంచుకునే కుక్కను బయటకు తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మీ కుక్క ఎవరినైనా కరిచిందంటే రూ.పదివేల జరిమానా తప్పదని నోయిడా అథారిటీ సీఈవో పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. పెంపుడు జంతువులకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు అమలుచేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జనవరి 31 వరకు పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నోయిడా అధికారులు తెలిపారు. పెంపుడు జంతువులకు స్టెరిలైజేషన్, యాంటీబయాటిక్ వ్యాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. ఇక, పెంపుడు జంతువుల కోసం ఇంట్లో చేసే ఏర్పాట్లు కూడా నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు జంతువు మలమూత్రాలు చేస్తే దానిని శుభ్రం చేయాల్సిన బాధ్యత వాటి యజమానులదేనని చెప్పారు. ఎవరినైనా గాయపరిచితే.. వారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు రూ.పది వేలు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

More Telugu News