Somireddy Chandra Mohan Reddy: ఆక్వా రైతుల బ్రతుకులను సజ్జల, అప్పలరాజు, బొత్స రివర్స్ చేశారు: సోమిరెడ్డి

  • కొత్త చట్టాలు తీసుకురాకముందు పరిస్థితే బాగుందన్న సోమిరెడ్డి   
  • మంత్రుల కమిటీ నిర్ణయాలు నష్టదాయకమని విమర్శలు
  • పంటవిరామం ప్రకటించే స్థితి ఏర్పడిందని ఆగ్రహం 
Somireddy slams AP ministers over aqua farmers issues

రాష్ట్రంలో రొయ్యల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్వా సేద్యం కుదేలైందని, జగన్ రెడ్డి ఆక్వా కల్చర్ పై కొత్త చట్టాలు తీసుకురాక ముందు పరిస్థితి బాగుందని అన్నారు. 

అక్టోబర్ 17 న సజ్జల, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు లు కలిసి రొయ్యలకు రేట్లు నిర్ణయించారని, నాటి నుంచి రొయ్యల రైతుల పరిస్థితి రివర్స్ అయిందని విమర్శించారు. మొన్న కేజి ధర రూ.240 గా నిర్ణయించి నిన్న రూ.210 అని చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 

"ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ యాక్ట్ (యాక్ట్ ఆఫ్ 29/2020), సీడ్ యాక్ట్ నం.36/2020 లను తీసుకొచ్చారు. రొయ్యల సాగు చేసే రైతులపై, సీడ్ తయారుచేసే హేచరీలపై, ఫీడ్ తయారుచేసే పరిశ్రమలపై, ప్రాసెసింగ్ యూనిట్లపై, ఎగుమతులు చేసే కంపెనీలపై చట్టం తీసుకొచ్చి తమ చేతుల్లో పెట్టుకోవాలని చూశారు. దీని కారణంగా రొయ్యల రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూస్తున్నారు. 

అక్టోబర్ 17 న 100 కౌంట్ ధర మార్కెట్ లో రూ.220 ఉంటే మంత్రుల కమిటీ రూ.240 మద్దతు ధర ప్రకటించింది. అప్పటి నుంచి 100 కౌంట్ ధర మార్కెట్ లో రూ.190 కి పడిపోయింది. మరలా ఈరోజు మద్దతు ధర కుదింపు చేసి రూ.210కి కొని తీరాలని మంత్రిగారు సెలవిస్తున్నారు. అసలు, చట్టం దేనికి తీసుకొచ్చారు? మీరు ఇందులో ప్రమేయం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ప్రశ్నించారు.

"మార్కెట్ లో కిలో సోయాబీన్ ధర రూ.90 నుంచి రూ.50కి పడిపోయినా రొయ్యల ఫీడ్ కాస్ట్ మాత్రం ఎందుకు తగ్గడం లేదు? ఇటీవల గోదావరి జిల్లాలో ఒక రైతు తన రొయ్యలు కొనేవాళ్లు లేరంటూ గ్రామంలో పంచిపెట్టిన దృశ్యాలు చూస్తుంటే రొయ్యల రైతుకు ఎంత కష్టం వచ్చిందో అర్ధమౌతుంది. నిల్వ చేయడానికి ఇది ధాన్యం కాదు. రెండు, మూడు రోజులు ఆలస్యమైతే మోర్టాలిటీ రేటు పెరుగుతుంది. 

చంద్రబాబు గారి హయాంలో షరతులు లేకుండా యూనిట్ రూ.2కి విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రూ.4.50 వరకు వసూలు చేస్తున్నారు. రొయ్యల రైతులకు ట్రాన్స్ ఫార్మార్లు పెట్టాలంటే రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏరియేటర్లు సబ్సీడీపై రూ.12వేలకు మేం ఇచ్చాం, మోటార్లు సబ్సీడీపై ఇచ్చాం. 

రొయ్యల రైతుకు రోజూ నరకం చూపిస్తున్నారు. జగన్ రెడ్డి నియమించిన కమిటీ రైతులకు నష్టం చేకూరుస్తోంది. ఒక్క రైతు వద్దనైనా రూ.210కి కొనుగోలు చేయించగలరా? ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి లంచాలు వసూలు చేయడానికే ఇదంతా చేస్తున్నారు. జగన్ రెడ్డి చర్యలు దురదృష్టకరం. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతులు అప్పులపాలవుతున్నారు. ఫీడ్ కాస్ట్ ఎందుకు తగ్గించరు? మద్దతు ధర ఎందుకు ఇవ్వరు? అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు" అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News