Sajjala Ramakrishna Reddy: ఒకవేళ పవన్, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆక్రమణలపై చర్యలు తీసుకోకుండా ఉంటారా?: సజ్జల

  • ఇటీవల ఇప్పటంలో కూల్చివేతలు
  • గ్రామంలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • ఏమీ లేకపోయినా రాద్ధాతం చేస్తున్నారన్న సజ్జల  
Sajjala slams Pawan Kalyan over Ippatam issue

ఇటీవల ఇప్పటం గ్రామంలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇప్పటం గ్రామంలో ఆక్రమణలకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో వైసీపీ సహా అందరూ ఉన్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం సబబేని సజ్జల స్పష్టం చేశారు. కూల్చివేతలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. అధికారులు ప్రభుత్వ విధానాలు అనుసరించి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. 

ఒకవేళ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని పవన్ కోరుకుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. కూల్చివేతలకు సంబంధించి నష్టపరిహారం అన్నది ప్రశ్నే కాదని, అసలక్కడ పవన్ కల్యాణ్ కు సంబంధించిన వాళ్లెవరూ లేరని సజ్జల పేర్కొన్నారు. 

ఇప్పటికే అక్కడికి చంద్రబాబునాయుడు కొడుకు, పవన్ కల్యాణ్ వచ్చారని, మరి చంద్రబాబు ఎందుకు రాలేదో తెలియదని, వాయిదాల పద్ధతిలో ఆయన కూడా వస్తారేమోనని వ్యాఖ్యానించారు. అసలు ఏమీ లేని చోట ఓ సినిమా కథ తయారుచేస్తున్నారని, స్క్రిప్టు రూపొందిస్తున్నారని విమర్శించారు. అనుకూల మీడియాలో ఈ స్క్రిప్టు ప్రకారం వచ్చే వార్తలు చూస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేదే లేదన్న భావన కలిగించేలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

నిజంగా అధికారంలోకి రావాలనుకుంటే అందుకు తగిన మార్గం ఇది కాదని, లేనివి ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటంలో ఏం జరిగిందని పవన్ కల్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ది అధికారం కోసం తాపత్రయం అని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కూడా విశాఖ వచ్చి ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడన్న ఓర్వలేనితనంతోనే రోజూ విషం కక్కుతున్నారని తెలిపారు. 

తెలుగుదేశం కరపత్రాలు అనదగ్గ కొన్ని మీడియా సంస్థలు అజెండా రూపొందిస్తున్నాయని, ఈ నేతలు ఆ అజెండాను మోస్తున్నారని, మళ్లీ ఇది ఆ మీడియా సంస్థలకు కావాల్సిన న్యూస్ మెటీరియల్ అవుతోందని సజ్జల వివరించారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగితే కంకర పోశారంటూ ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లడం ఈ కోవలోకే వస్తుందని తెలిపారు.

More Telugu News