Telangana: జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే రాజా సింగ్

  • విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్
  • 40 రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న గోషా మహల్ ఎమ్మెల్యే
  • హైకోర్టు బెయిల్ తో జైలు నుంచి విడుదలైన వైనం
mla raja singh released from charlapalli jail

విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఓ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియోను విడుదల చేశారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పీడీ యాక్ట్ ను కూడా పోలీసులు ప్రయోగించారు. అనంతరం రాజా సింగ్ ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు...కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.


దాదాపుగా 40 రోజుల పాటు చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజా సింగ్...జైలు నుంచే న్యాయ పోరాటం చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని, తనపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు... బుధవారం సాయంత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజా సింగ్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు అధికారులులు రాజా సింగ్ ను బుధవారం రాత్రి విడుదల చేశారు. హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు.

More Telugu News