Hormone: వృద్ధాప్యంలో ఏ రోగాలొస్తాయో ఈ ఒక్క హార్మోన్ ను చూసి చెప్పేయవచ్చు..!

  • వ్యాధుల గురించి ముందే చెప్పే ఐఎన్ఎస్ఎల్ 3 
  • యుక్త వయసులో ఇది తక్కువగా ఉంటే.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యల ముప్పు
  • తాజా పరిశోధనలో కనుగొన్న శాస్త్రవేత్తలు
Vital Role of a Hormone Discovered Could Predict Long Term Health of Men

వయసు మీద పడిన తర్వాత లేదా వృద్ధాప్యానికి చేరువ అవుతున్న తరుణంలో ఏవైనా వ్యాధులు వస్తాయా? ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవడం ఎలా? దీనిపై యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హమ్ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. బాల్య దశ నుంచి యుక్త వయస్సులోకి ప్రవేశించే సమయంలో పురుషుల్లో టెస్టో స్టెరాన్ తో పాటు, ఐఎన్ఎస్ఎల్ 3 అనే ఇన్సులిన్ తరహా ఒక పెప్టైడ్ హార్మోన్ ఉత్పత్తి మొదలవుతుంది.

వయసు పెరిగిన తర్వాత వచ్చే వ్యాధులకు సంబంధించి దీన్ని ముఖ్యమైన బయోమార్కర్ గా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమయ్యాయి. పురుషుడి వృషణాల్లోని కణాలు టెస్టో స్టెరాన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయని తెలుసు. ఈ కణాలే ఐఎన్ఎస్ఎల్ 3ని కూడా ఉత్పత్తి చేస్తాయి. 

టెస్టో స్టెరాన్ జీవితాంతం ఒకే స్థాయిలో ఉండదు. హెచ్చు తగ్గులకు లోనవుతుంటుంది. కానీ, ఐఎన్ఎస్ఎల్ 3 అలా కాదు. జీవితాంతం ఒకే స్థాయిలో ఉంటూ, జీవిత చరమాంకంలో స్వల్పంగా తగ్గుతుంది. వయసు ఆధారిత వ్యాధులు వచ్చే విషయాన్ని చెప్పే ముఖ్య సూచిక ఇదేనని తాజా అధ్యయనం తెలుసుకుంది. రక్తంలో ఐఎన్ఎస్ఎల్ 3 స్థాయికి, ఎముకల బలహీనత, లైంగిక సామర్థ్యం, మధుమేహం, గుండె జబ్బులకు మధ్య సంబందం ఉందని వీరు తెలిపారు. 

యుక్తవయసులో ఐఎన్ఎస్ఎల్ 3 అధికంగా ఉన్న వారికి వృద్ధాప్యంలోనూ అది అధిక పరిమాణంలోనే ఉంటుందని, యుక్త వయసులో తక్కువ ఉన్న వారికి చివరి జీవితంలో తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇలా ఐఎన్ఎస్ఎల్ 3 తక్కువగా ఉండే వారికి వృద్ధాప్యంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్నారు.

More Telugu News