IPL: ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అవుతుంది: అరుణ్ ధుమాల్

  • టీమిండియా ఆటగాళ్లను బయటి లీగుల్లో ఆడనివ్వబోమన్న అరుణ్ ధుమాల్
  • జట్లను 10కి మించి పెంచే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
  • మహిళా ఐపీఎల్‌ను పురుషుల టోర్నీకి దీటుగా నిర్వహిస్తామన్న ఐపీఎల్ చైర్మన్
IPL Will Become World biggest sport event league Arun Dhumal

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లలో ఒకటిగా అవతరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. లీగును మరింత ఆకర్షణీయంగా మారుస్తామని, టీవీలో చూసినా, మైదానంలో చూసినా అందరికీ నాణ్యమైన అనుభవం ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. టీమిండియా క్రికెటర్లను బయటి లీగుల్లో ఆడేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఐపీఎల్ షెడ్యూల్‌ను ముందుగానే విడుదల చేస్తే అభిమానులు కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతారన్న ఆయన.. ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 10కి మించి పెంచే ప్రసక్తే లేదన్నారు.

తొలి రెండు సీజన్లలో 74గా ఉన్న మ్యాచుల సంఖ్య ఆ తర్వాత 84కు పెరిగిందని, ఇప్పుడా సంఖ్య 94కు పెరిగిందన్నారు. మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల టోర్నీ సుదీర్ఘంగా సాగుతోందని అన్నారు. అంతర్జాతీయ షెడ్యూల్స్, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని బయటి లీగుల్లో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి ఇవ్వకూడదని బీసీసీఐ భావిస్తోందని, మున్ముందు కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

ఇక మహిళా ఐపీఎల్‌ను కూడా పురుషుల లీగ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్వహిస్తామన్నారు. ఈ లీగ్ నుంచి స్ఫూర్తి పొంది మరెంతోమంది అమ్మాయిలు క్రికెట్‌లోకి వస్తారని అన్నారు. పురుషులతో సమానంగా అమ్మాయిలకు ఫీజులు పెంచడం వెనక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని అరుణ్ ధుమాల్ వివరించారు.

More Telugu News