Health Concern: ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న నాన్ స్టిక్ పాత్రల వాడకం.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • ఈ పాత్రలకు టెఫ్లాన్ తో కోటింగ్
  • కొంత కాలం వినియోగం తర్వాత తొలగిపోయే కోటింగ్
  • ఆహారంతో కలసి మన శరీరంలోకి చేరిక
Health Concern Non Stick Pans Could Release Millions Of Microplastics Says Study

ఆధునిక జీవనంలో నాన్ స్టిక్ పాత్రల వినియోగం పెరిగింది. వీటిల్లో వండితే పదార్థాలు అంటుకోకుండా, శుభ్రం చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. పైగా దోశల వంటివి నాన్ స్టిక్ పెనాలపై మంచి అందంగా వస్తుంటాయి. కనుక చాలా మంది వీటికి అలవాటు పడ్డారు. కానీ, వీటి వాడకం వల్ల ఉన్న హెల్త్ రిస్క్ లపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఫ్లైండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ కు చెందిన పరిశోధకులు నాన్ స్టిక్ పాత్రల వాడకంపై ఓ పరిశోధన నిర్వహించగా, దీని ఫలితాలు సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్ మెంట్ లో ప్రచురితమయ్యాయి. నాన్ స్టిక్ అంటే అంటుకోనిది అని అర్థం. టెఫ్లాన్ అనే కెమికల్ కోటింగ్ వల్ల ఈ నాన్ స్టిక్ గుణం వస్తుంది. ఈ పాత్రలను వాడుకుంటూ, వాటిని శుభ్రం చేస్తున్న క్రమంలో కొంత కాలానికి ఈ కోటింగ్ కొద్ది కొద్దిగా పోతుండడం గమనించే ఉంటారు. ఇలా తొలగిపోయే టెఫ్లాన్ కోటింగ్ రూపంలో 9,100 కెమికల్ పార్టికల్స్ మన ఆహారంలోకి చేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

సూక్ష్మ ప్లాస్టిక్స్ (5 మిల్లీమీటర్ కంటే చిన్నవి), నానో ప్లాస్టిక్స్ (ఒక మిల్లీ మీటర్ కంటే చిన్నవి) విడుదలను తెలుసుకునేందుకు పరిశోధకులు రామన్ ఇమేజింగ్ టెక్నిక్ ను పాటించారు. ఈ టెఫ్లాన్ మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలుస్తుండడం ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే అంశంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ పరిశోధకుడు డాక్టర్ చెంగ్ ఫాంగ్ పేర్కొన్నారు. వీటి కారణంగా జరిగే నష్టంపై పరిశోధన అవసరం ఉందన్నారు. టెఫ్లాన్ కోటింగ్ తొలగిపోతున్న పాత్రల నుంచి 2.3 మిలియన్ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కనుక వంటలకు వినియోగించే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఫ్లైండర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ చెప్పారు.

More Telugu News