China: పాకిస్థాన్ కు రూ.73 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందిస్తున్న చైనా... ఇంకా సాయం చేస్తామన్న జిన్ పింగ్

  • పాక్ ను మిత్రదేశంగా భావిస్తున్న చైనా
  • అప్పుల్లో కూరుకుపోయిన పాక్
  • పాక్ ను పతనం కానివ్వబోమన్న చైనా నాయకత్వం
China assures more help to ally Pakistan

మిత్రదేశం పాకిస్థాన్ కు చైనా మరోసారి ఆపన్న హస్తం అందించింది. తీవ్రస్థాయిలో అప్పులపాలైన పాకిస్థాన్ కు తాజాగా రూ.73 వేల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి శక్తిమేర సాయపడుతున్నామని చైనా వెల్లడించింది. 

అవసరమైతే పాక్ కు ఇంకా సాయం చేస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హామీ ఇచ్చారని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఓ జిన్ పింగ్ భేటీ అయ్యారని... "మీరేమీ చింతించవద్దు... పాకిస్థాన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వం" అని భరోసా ఇచ్చారని దార్ వివరించారు. 

అటు, సౌదీ అరేబియా కూడా ఆర్థికంగా మద్దతు ఇస్తోందని, సౌదీ నుంచి రూ.32 వేల కోట్ల నిధులు అందనున్నాయని వెల్లడించారు.

కాగా, పాక్ ఆర్థికమంత్రి వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిది ఝావో లిజియన్ నిర్ధారించారు. పాక్ కు తాము ఆర్థిక సాయం చేస్తున్నామని, ఇకపైనా అది కొనసాగుతుందని తెలిపారు.

More Telugu News