Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు: రాహుల్ గాంధీ

  • కామారెడ్డి జిల్లా మేనూర్ లో సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ
  • తెలంగాణలో తన యాత్రకు ఊహించని స్పందన వచ్చిందని వెల్లడి
  • తెలంగాణను వీడిపోతుండటం బాధగా ఉందన్న కాంగ్రెస్ నేత
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ఎవరి భూములు వారికి వస్తాయని వ్యాఖ్య 
  • రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తగ్గుతాయన్న రేవంత్ రెడ్డి
rahul gandhi said congress will form next government in telangana

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర సోమవారం తెలంగాణలో ముగిసింది. దాదాపుగా 10 రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగిన పాదయాత్రకు పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభతో తెలంగాణలో రాహుల్ యాత్ర ముగిసింది. సభ అనంతరం తెలంగాణను వీడిన రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెట్టింది. 


మేనూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగుతున్న తన యాత్రకు తెలంగాణలో ఊహించని రీతిలో అనూహ్య మద్దతు లభించిందని రాహుల్ పేర్కొన్నారు. తన యాత్రను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ చేసిన కృషి ఫలించిందన్నారు. యాత్రలో తెలంగాణకు చెందిన పలు వర్గాల ప్రజలతో మాట్లాడానని, ఆయా వర్గాల కష్ట సుఖాలను తెలుసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల పనితీరు గొప్పగా ఉన్నా... ఇవేమీ మీడియాలో కనిపించవన్నారు. గతంలో ఎన్నో సార్లు తెలంగాణకు వచ్చానని, అయితే ఈ సారి తెలంగాణను వీడి వెళ్లడం తనను బాధిస్తోందన్నారు. 

ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. ఆ ప్రయోజనాలు ఆయా వర్గాలకు అందకుండా అటు ఎన్డీఏ సర్కారు, ఇటు టీఆర్ఎస్ సర్కారు అడ్డుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే... ఎవరి భూములు వారికి వస్తాయన్నారు. ఈ దఫా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఏ ఒక్క శక్తి అడ్డుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సభలో ప్రసంగించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తగ్గుతాయని చెప్పారు.

More Telugu News