T20 World Cup: ఆశలే లేని స్థితి నుంచి టీ20 ప్రపంచ కప్ సెమీస్​ కు పాకిస్థాన్

  • తొలి రెండు మ్యాచ్ ల్లో  భారత్, జింబాబ్వే చేతిలో ఓటమి
  • నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్ రేసులోకి పాక్
  • బంగ్లాదేశ్ పై ఐదు వికెట్లతో గెలిచి సెమీఫైనల్ బెర్తు సొంతం చేసుకున్న పాకిస్థాన్ జట్టు
Pakaisthan reaches t20 world cup semis

తొలి మ్యాచ్ లో భారత్, తర్వాత చిన్న జట్టు జింబాబ్వే చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ అదృష్టం కలిసొచ్చి సెమీఫైనల్ చేరుకుంది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని పాక్ రెండు చేతులా ఒడిసిపట్టుకుంది. ఆదివారం అడిలైడ్ లో జరిగిన సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ చేరుకుంది. 

మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 127/8 స్కోరు చేసింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (48 బంతుల్లో 7 ఫోర్లతో 54) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. సౌమ్యా సర్కార్ (20), అఫిఫ్ హొస్సేన్ (24 నాటౌట్) రాణించారు. లిటన్ దాస్ (10), షకీబ్ అల్ హసన్ (0), మొసాదెక్ హొస్సేన్ (5), నురుల్ హసన్ (0), తస్కిన్ అహ్మద్ (1), నసుమ్ అహ్మద్ (7) నిరాశ పరిచారు. 

పాక్ బౌలర్లలో యువ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. షాదాబ్ ఖాన్ రెండు, ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం పాకిస్థాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (34), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24), మొహమ్మద్ హారిస్ (31 నాటౌట్), షాన్ మసూద్ (24 నాటౌట్) రాణించారు. 

ప్రస్తుతం గ్రూప్ 2లో పాక్ 6 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. జింబాబ్వేతో మ్యాచ్ లో భారత్ గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానం సాధిస్తుంది. ఇప్పటికే భారత్ సెమీస్ చేరింది. గ్రూప్1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్లో అడుగు పెట్టాయి.

More Telugu News