Underground Chamber: ముంబయి జేజే ఆసుపత్రిలో బయల్పపడిన అండర్ గ్రౌండ్ చాంబర్

  • ఓ లీకేజిని పరిశీలిస్తుండగా డాక్టర్ కంటబడిన భూగృహం
  • 12 మీటర్ల పొడవున్న నిర్మాణం
  • జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించిన ఆసుపత్రి వర్గాలు
  • 132 ఏళ్ల నాటిదని అంచనా
Underground Chamber found in Mumbai JJ Hospital

ముంబయిలోని ప్రఖ్యాత జేజే ఆసుపత్రిలో పురాతనమైన ఓ భూగృహం బయటపడింది. ఈ అండర్ గ్రౌండ్ చాంబర్ 12 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 132 ఏళ్ల నాటి భూగృహం అని భావిస్తున్నారు. రాతి గోడలు, ఇటుకల వరసలతో ఇది నిర్మితమైంది. 

ఈ ప్రాచీన నిర్మాణం సరిగ్గా జేజే ఆసుపత్రిలోని నర్సింగ్ కాలేజి కింది భాగంలో ఉంది. ఈ భూగృహాన్ని జేజే ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ అరుణ్ రాథోడ్ కనుగొన్నారు. ఓ లీకేజీని పరిశీలిస్తుండగా, ఈ భూగృహం ఆయన కంటబడింది.

జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ పల్లవి సప్లే దీనిపై స్పందిస్తూ, ఈ భూగృహం ఎందుకు కట్టారో, ఎవరు కట్టారో తెలియడంలేదని అన్నారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్ కు, పురావస్తు శాఖకు సమాచారం అందించామని తెలిపారు. కొందరు ఇది బాంబు షెల్టర్ అయ్యుంటుందని చెబుతున్నారని వివరించారు. 

జేజే ఆసుపత్రిలో అండర్ గ్రౌండ్ చాంబర్ బయటపడిందన్న సమాచారంతో సిబ్బంది, రోగులు, వారి బంధువులు దీన్ని చూసేందుకు తరలివచ్చారు. ఈ భూగృహాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు.

More Telugu News