Virat Kohli: పాక్ జట్టులో ఉండుంటే ఈపాటికి ఇంటికి పోయేవాడు... కోహ్లీపై చర్చ చేపట్టిన పాక్ క్రికెట్ దిగ్గజాలు

  • ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యత నిచ్చే కోహ్లీ
  • కోహ్లీ కెరీర్ ను ఫిట్ నెస్సే నడిపిస్తోందన్న పాక్ మాజీలు
  • కెప్టెన్సీ పోయినా నామోషీ పడలేదన్న అక్రమ్
Pakistan former cricketers debates on Kohli fitness

విరాట్ కోహ్లీ... టీమిండియాలో అత్యంత ఫిట్ గా ఉండే ఆటగాడు. ఆట పరంగా కోహ్లీ ఫెయిలై ఉండొచ్చేమో కానీ, ఫిట్ నెస్ పరంగా విఫలమైందే లేదు. కోహ్లీ గాయాలబారినపడడం అత్యంత అరుదైన విషయం. 30 ఏళ్లకు పైబడినప్పటికీ కోహ్లీ ఇప్పటికీ తన శారీరక దారుఢ్యాన్ని చెక్కుచెదరని రీతిలో కాపాడుకుంటూ వస్తున్నాడు. వికెట్ల మధ్య అతడు పరిగెత్తే తీరు, ఫీల్డింగ్ లో పరుగులు ఆపే విధానం అందుకు నిదర్శనం. ఇప్పుడీ అంశమే పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాల మధ్య చర్చకు వచ్చింది. 

వసీం అక్రమ్, వకార్ యూనిస్, మిస్బావుల్ హక్, షోయబ్ మాలిక్ ఓ టీవీ చర్చ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

కోహ్లీ ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణించడానికి ఫిట్ నెస్ కూడా ఓ కారణమని షోయబ్ మాలిక్ పేర్కొనగా, వసీం అక్రమ్ స్పందిస్తూ.. తాను కెప్టెన్ గా లేని సమయంలోనూ ఓ బ్యాట్స్ మన్ గా, ఫీల్డర్ గా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాడని కొనియాడాడు. 

"తనను కెప్టెన్ గా తొలగించారని ఎప్పుడూ బాధపడలేదు. ఎలాంటి నామోషీ లేకుండా ఆఖరికి షార్ట్ ఫైన్ లెగ్ లో కూడా ఫీల్డింగ్ చేశాడు. బ్యాట్స్ మన్ గా అత్యుత్తమ సేవలు అందిస్తాను, జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ గా నిలుస్తాను అంటూ తనను తాను ప్రోత్సహించుకునేవాడు" అని అక్రమ్ వివరించాడు. 

అనంతరం వకార్ యూనిస్ స్పందిస్తూ, అదే పాకిస్థాన్ లో అయితే కెప్టెన్సీ ఊడితే ఇక జట్టులో స్థానం ఉండదు, ఇంటికి పోవాల్సిందే అని వెల్లడించాడు. తనకు తెలిసినంతవరకు పాక్ జట్టులో కెప్టెన్సీ పోగొట్టుకున్న తర్వాత ఆటగాడిగా రాణించినవారే లేరు అని స్పష్టం చేశాడు. 

షోయబ్ మాలిక్ కూడా కోహ్లీపై ప్రశంసలు జల్లు కురిపించాడు. కోహ్లీ ఎప్పుడూ తన వైఫల్యాల చాటున మరుగునపడిపోలేదని, బ్యాట్స్ మన్ గా విఫలమైతే ఫీల్డర్ గా అయినా రాణించేందుకు రెట్టించిన పట్టుదలతో శ్రమించేవాడని మాలిక్ వివరించాడు. ఫీల్డింగ్ సమయంలో జట్టుకు సాయపడేందుకు కోహ్లీ సదా ముందుంటాడని, తాను సెంచరీ చేసినా, సున్నాకే అవుటైనా ఫీల్డింగ్ లో దిగినప్పుడు ఒకే ఉత్సాహం కనబరుస్తాడని కొనియాడాడు.

More Telugu News