Telangana: బెయిల్ కోరి ఉంటే ఈ రోజే ఇచ్చేవాళ్లం... 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసు నిందితుల పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుల రిమాండ్ కు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
  • ఆ తర్వాత రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో నిందితుల పిటిషన్
  • హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పులను ఎలా ఇస్తుందన్న సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా
supreme court comments on mlas poaching case accused petition

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో అరెస్టయిన నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే... ఈ రోజే బెయిల్ ఇచ్చేవారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే నిందితులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొంది. 

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తాము యత్నించామంటూ అసత్య ఆరోపణలను ఆధారం చేసుకుని తెలంగాణ హైకోర్టు తమను రిమాండ్ కు పంపాలని ఆదేశాలు జారీ చేసిందని, హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అరెస్టయిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

ఈ పిటిషన్ పై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ పోలీసులు పక్షపాత వైఖరితో తమపై కేసు పెట్టారని పిటిషనర్లు వాదించారు. ట్రయల్ కోర్టు తమ రిమాండ్ కు నిరాకరించగా... రెండు రోజులకే ఆ తీర్పును హైకోర్టు మార్చివేసిందని, తమను రిమాండ్ కు పంపిందని తెలిపారు.

 ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు... హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని కూడా ప్రశ్నించింది. ఈ  కేసులో మెరిట్స్ ఆధారంగానే విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

More Telugu News