Risat-2: పదమూడున్నరేళ్ల తర్వాత భూవాతావరణంలో ప్రవేశించిన ఇస్రో రిశాట్-2 ఉపగ్రహం

  • 2009లో రిశాట్-2 ప్రయోగం
  • ఉపగ్రహ కాలపరిమితి 4 సంవత్సరాలు
  • మూడు రెట్లు అధికంగా సేవలందించిన ఉపగ్రహం
  • ఇంధనం అయిపోవడంతో భూవాతావరణంలోకి ప్రవేశం
Risat 2 satellite re enters into earth atmosphere

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2009లో ప్రయోగించిన రిశాట్-2 ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇది నాలుగేళ్ల పాటు సేవలు అందించేలా దీన్ని ఇస్రో రూపొందించింది. 

అయితే, కక్ష్యలో ప్రవేశించినప్పటి నుంచి సరైన ప్రణాళికతో వ్యవహరించడం, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల రిశాట్-2 ఉపగ్రహం పదమూడున్నరేళ్ల పాటు నిరాటంకంగా పనిచేసింది. ఎంతో విలువైన డేటాను ఇస్రోకు పంపింది. దీని బరువు 300 కిలోలు కాగా, ప్రయోగించిన సమయంలో ఇందులో 30 కేజీల ఇంధనం ఉంది. 

కాగా, దీనిలోని ఇంధనం పూర్తిగా అయిపోవడంతో గత నెల 30వ తేదీన భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఇది హిందూ మహాసముద్రంలో జకార్తా వద్ద భూవాతావరణంలోకి అడుగుపెట్టి ఉంటుందని ఇస్రో అంచనా వేసింది. దీని శకలాలేవీ భూమిని తాకకపోవడంతో, భూవాతావరణంలోకి ప్రవేశించగానే దగ్ధమైపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన చేసింది. 

అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎలాంటి శకలాలు భూమిని తాకని రీతిలో రిశాట్-2ను భూవాతావరణానికి మరలించామని వెల్లడించించింది. ఇస్రో సామర్థ్యాలకు ఈ ప్రక్రియ గీటురాయిలా నిలుస్తుందని పేర్కొంది. అంతరిక్షంలో శకలాలు పేరుకుపోకుండా, ఇస్రో తన వంతు కృషి చేస్తోందని, ఆ మేరకు అంతర్జాతీయ మార్గదర్శకాలకు కట్టుబడి ఉందని వివరించింది. రిశాట్-2 ప్రధానంగా నిఘా అవసరాలకు ఉద్దేశించిన రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని తెలుస్తోంది.

More Telugu News