Australia: టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్... భారీ విజయంపై కన్నేసిన ఆస్ట్రేలియా

  • చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్
  • భారీ రన్ రేట్ కోసం ఆసీస్ ప్రయత్నం
  • గ్రూప్-1లో సెమీస్ బెర్తు కోసం గట్టిపోటీ
  • ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య కీలకం కానున్న రన్ రేట్
Australia eyes on huge win over Afghanistan

నేడు టీ20 వరల్డ్ కప్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. సూపర్-12 దశలోని ఈ గ్రూప్-1 మ్యాచ్ కు అడిలైడ్ లోని ఓవల్ మైదానం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 28, స్టొయినిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 25, కామెరాన్ గ్రీన్ 3, స్మిత్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. 

కాగా, ఈ మ్యాచ్ ఆసీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చివరి లీగ్ మ్యాచ్. ఆఫ్ఘన్ జట్టు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకోగా, ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే ఆసీస్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇంగ్లండ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా ఆసీస్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే, ఆసీస్ కే సెమీస్ బెర్తు దక్కుతుంది. 

అందుకే ఆఫ్ఘనిస్థాన్ పై భారీ స్కోరు సాధించి, ఆపై బౌలింగ్ లో విజృంభించి స్వల్పస్కోరుకే కట్టడి చేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్, ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. వారి స్థానంలో స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, కామెరాన్ గ్రీన్ జట్టులోకి వచ్చారు. 

ఈ గ్రూప్ నుంచి సెమీస్ అవకాశాల కోసం శ్రీలంక కూడా కాచుకుని ఉంది. ఆ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ను ఇంగ్లండ్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే రన్ రేట్ కీలకమవుతుంది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. మరో సెమీస్ బెర్తు కోసం ముక్కోణపు పోటీ నెలకొంది.

More Telugu News