Andhra Pradesh: అయ్యన్న 420 పని చేస్తే బీసీలకేం సంబంధం?: జోగి రమేశ్

  • అయ్యన్న అరెస్ట్, టీడీపీ విమర్శలపై స్పందించిన మంత్రి రమేశ్
  • ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కేసులు పెట్టకూడదా? అని నిలదీత
  • టీడీపీకేమైనా సొంత రాజ్యాంగం రాశారా? అని ప్రశ్న
  • పవన్ గురించి ఆలోచించే సమయం లేదని వ్యాఖ్య
  • చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదని వ్యంగ్యం
ap minister jogi ramesh fires on tdp agitations over ayyannapatrudu arrest

భూ ఆక్రమణ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు తెర లేపాయి. ఈ నిరసనలు, అయ్యన్న అరెస్ట్ పై చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు 420 పని చేస్తే... దానితో బీసీలకేం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కేసులు పెట్టకూడదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ తీరుపై ఆయన మండిపడ్డారు.

అయ్యన్న అరెస్ట్ చూపి బీసీలను రెచ్చగొట్టాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చూస్తున్నారని రమేశ్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడే నేతలపై కేసులు పెట్టొద్దని చెబుతారా? అంటూ ప్రశ్నించిన రమేశ్... టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా? అని నిలదీశారు. అయినా అయ్యన్నను అరెస్ట్ చేస్తే బీసీల గొంతు నొక్కడం ఏమిటన్నారు. ఎవరి విషయంలో అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రమేశ్... చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదని వ్యాఖ్యానించారు. 

ఇక పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందన్న వార్తలపైనా మంత్రి రమేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ లాంటి నేతల గురించి ఆలోచించే సమయం తమకు లేదని ఆయన అన్నారు. ఎంతసేపూ తాము ప్రజలకు ఏ మేర సంక్షేమం అందించామన్న దానిపైనే ఆలోచిస్తామన్నారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎవరో ఏదో చేస్తే తమకేమి సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. 

శత్రువు కూడా బాగుండాలి... ఎదుటి పార్టీ కూడా బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం తమదని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమం వద్దే తాము ఇతర పార్టీలతో పోరాటం  చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపిస్తున్నామన్నారు. టీడీపీ ధనికులను ఇంకా ధనికులను చేయాలని ఆలోచన చేస్తే... పేదలను పైకి లేపే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారని రమేశ్ అన్నారు.

More Telugu News