Vijayasai Reddy: బాబు, బాలకృష్ణ బంధువుల గీతం వర్సిటీ మాత్రమే కళకళలాడాలా?: విజయసాయిరెడ్డి

  • ఏయూ వీసీపై ఓ పత్రికలో కథనం
  • వైస్ చాన్సలరా? వైసీపీ బ్రోకరా? అంటూ విమర్శలు
  • ఘాటుగా స్పందించిన విజయసాయిరెడ్డి
  • పచ్చ కుల మీడియా అంటూ వ్యాఖ్యలు
Vijayasai Reddy slams media

'వైస్ చాన్సలరా... వైసీపీ బ్రోకరా' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. దేవాలయం వంటి ఆంధ్రా యూనివర్సిటీని స్వార్థ రాజకీయాల కోసం జర్నలిజం విలువలను పాతాళానికి దిగజారుస్తూ నీచానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గీతం ప్రైవేటు యూనివర్సిటీ కోసం ఆంధ్రా యూనివర్సిటీని దిగజార్చవద్దని హితవు పలికారు. 

చరిత్రలోనే అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీపై అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని కాన్సులేట్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయని వెల్లడించారు. ఏయూతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. సిఫారసులకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతోందని స్పష్టం చేశారు. 

అలాంటి ఆంధ్రా వర్సిటీపై పచ్చ కుల తెలుగు దొంగల ద్వేషం ఎప్పటికీ తగ్గదని విమర్శించారు. బాబు, బాలకృష్ణ బంధువుల గీతం వర్సిటీ మాత్రమే కళకళలాడాలి... అక్రమంగా వచ్చిన భూములతో విలువ వేల కోట్లకు చేరాలి అని ఎత్తిపొడిచారు.

టీడీపీ హయాంలో ఏయూ వనరులను గీతంకు తరలించిన ఘనుడు ఎంవీఎస్ మూర్తి అని, ఏయూ మూతపడి విద్యార్థులు రోడ్డున పడాలని ఏయూని దెయ్యాల కొంప అని ఎంవీఎస్ మూర్తి అన్నాడని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వీసీని కూడా అవమానించారని తెలిపారు. ఏయూ దూరవిద్య విభాగాన్ని నిర్వీర్యం చేసిన అప్పటి డైరెక్టర్ హరినారాయణ చౌదరి పదవీవిరమణ తర్వాత గీతంలో చేరాడని వివరించారు. 

టీడీపీ హయాంలో ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీకి రానన్ని నిధులు, యూజీసీ ప్రాజెక్టులు ప్రైవేటు యూనివర్సిటీ గీతంకు ఎలా వచ్చాయో పచ్చ కుల మీడియాకు తెలుసని పేర్కొన్నారు. అనవసరంగా బురద చల్లకుండా, చేతనైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి అంటూ విజయసాయి హితవు పలికారు. 

ఏయూ వీసీ ప్రసాదరెడ్డిపై ఓ పత్రికలో తీవ్ర ఆరోపణలతో కథనం వచ్చింది. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి ఎమ్మెల్సీ ఓట్ల నమోదు దాకా అన్నింటికీ తానై ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ బ్రాంచిగా మార్చేసిన ఘనుడు వీసీ ప్రసాదరెడ్డి అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

More Telugu News