Uttar Pradesh: మద్యానికి బానిసై సీసాలను ఎత్తుకెళ్లి తాగేస్తున్న కోతి.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో ఘటన
  • జనం చేతుల్లోంచి మద్యం సీసాలను లాక్కుంటున్న కోతి
  • ఎదిరిస్తే దాడి చేస్తున్న వానరం
  • బంధించేందుకు అటవీశాఖ అధికారుల యత్నం
Alcohol Addicted Monkey Is A Menace For Liquor Shops In Uttar Pradesh

మద్యానికి బానిసైన ఓ వానరం వ్యాపారులకు, వినియోగదారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో ఈ వానరం చేస్తున్న ఆగడాలను స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. అది బీరు క్యాన్‌ను గటగటా తాగేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని లాక్కుంటున్న ఈ వానరం.. ఎదరిస్తే మాత్రం తిరగబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దాని దాడులకు భయపడుతున్న వినియోగదారులు మద్యం దుకాణానికి వెళ్లడం మానేస్తున్నారు.

కోతి ఆగడాలపై మద్యం వ్యాపారులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్న జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. అటవీ అధికారుల సాయంతో కోతిని బంధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

కాగా, లక్నో-కాన్పూరు రోడ్డులోని నవాబ్‌గంజ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ ఓ కోతి లిక్కర్ షాపునకు పర్మనెంట్ కస్టమర్‌గా మారింది. చిల్ల్డ్ బీరుపై మనసు పారేసుకున్న ఈ వానరానికి ఓ కస్టమర్ ప్రతి రోజు బీర్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ తర్వాత ఆ వానరం కాలేయం పెరిగి చనిపోయింది.

More Telugu News