Janasena: ఇప్పటంలో నాదెండ్ల మనోహర్... సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే మాట్లాడిన జనసేన నేత

  • జనసేన ఆవిర్భావ సభకు భూమిని ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులు 
  • అందుకు ప్రతిగా గ్రామానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
  • ఆ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని అధికారులు చెప్పడమేమిటని నాదెండ్ల ప్రశ్న
  • ఆ నిధులతో కట్టే కమ్యూనిటీ హాల్ కు వైఎస్సార్ పేరు పెడతామనడంపై ఆగ్రహం 
janasena pac chairman nadendla manohar meeting with ippatam villagers in cell phone torch light

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సోమవారం ఓ చేదు అనుభవం ఎదురైంది. గతంలో జనసేన ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేసిన సభ కోసం స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులతో భేటీ కోసం ఆయన సోమవారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ వాసులతో నాదెండ్ల మాట్లాడుతుండగానే... విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ తరహా పరిణామాలు జనసేనకు గతంలోనూ ఎదురైన నేపథ్యంలో జనసైనికులు తమ సెల్ ఫోన్లలో టార్చ్ లను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్ లోనే నాదెండ్ల తన సమావేశాన్ని కొనసాగించారు. నాదెండ్ల మనోహర్ ప్రసంగం ముగిసిన మరుక్షణమే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం గమనార్హం.

ఈ సందర్భంగా ఇప్పటం గ్రామానికి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షల విరాళంపై అధికారులు జారీ చేసిన ఆదేశాలపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్థులు తమ భూమిని ఇస్తే... దానికి ప్రతిగా గ్రామానికి పవన్ రూ.50 లక్షల విరాళం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా పవన్ నిధులతో గ్రామంలో ఓ కమ్యూనిటీ హాల్ ను నిర్మించి దానికి వైఎస్సార్ పేరు పెడతామని అధికారులు చెప్పడం మరింత విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News