Janasena: జనసేన పీఏసీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం

  • మంగళగిరిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
  • హాజరైన పవన్ కల్యాణ్
  • పలు తీర్మానాలపై చర్చ
Janasena PAC approves resolutions

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నేడు మంగళగిరిలో జరిగింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలకు ఆమోదం తెలిపినట్టు జనసేన పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. 

పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు వ్యవస్థను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించారని ఆరోపించింది. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియజేశారని వెల్లడించింది.  

కేంద్రమంత్రి మురళీధరన్,  టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్ సత్తా పార్టీ నేతలు జయప్రకాశ్ నారాయణ, బాబ్జీ ఈ చర్యలను ఖండించి పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారని వివరించింది. 

తెలంగాణకు చెందిన పలువురు నేతలు, పౌర సమాజం నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు, మేధావులు ఈ చర్యలను తప్పుబట్టి సంఘీభావం తెలిపారని జనసేన పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సమావేశంలో ఈ మేరకు మొదటి తీర్మానం చేసినట్టు వెల్లడించింది. 

ఇక, విశాఖలో 180 మందిపై వివిధ సెక్షన్లతో అక్రమ కేసులు నమోదు చేశారని, వారిలో 28 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని జనసేన తన ప్రకటనలో తెలిపింది. అరెస్ట్ చేసిన నేతలను అర్ధరాత్రి బలవంతంగా గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించారని ఆరోపించింది. 

కేసుల కారణంగా పోలీస్ స్టేషన్ల పాలైన నేతలు, వీర మహిళలు, జనసైనికులు, వారి కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యం నింపిన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రెండో తీర్మానం చేసినట్టు జనసేన వివరించింది.

విశాఖ అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నేత మన కుటుంబ సభ్యుడే అన్న భావనతో, వారిని కాపాడుకునే బాధ్యతను స్వీకరిస్తూ ఈ నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని నేటి సమావేశంలో బలపర్చినట్టు జనసేన వెల్లడించింది. అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొంది.

More Telugu News