Arvind Kejriwal: ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి..? గుజరాత్ లో ఆప్ పోల్

  • అభిప్రాయం తెలియజేయాలని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
  • ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటామని ప్రకటన
  • నవంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామన్న ఆప్ అధినేత
After Punjab Arvind Kejriwal asks Gujarat Who should be CM candidate

పంజాబ్ మాదిరే గుజరాతీ పౌరులకు తమ ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసుకునే ఆప్షన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కల్పించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియా సమావేశంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి’’ అని కోరారు. 6357000360 నంబర్ కు వాయిస్ మెస్సేజ్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లను నవంబర్ 3 నాటికి పంపించాలని సూచించారు.

అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, పనిలో పనిగా అధికార బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. తదుపరి ఐదేళ్ల విషయంలో బీజేపీ వద్ద ప్రణాళిక ఏదీ లేదన్నారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని తొలగించి భూప్రేంద పటేల్ ను నియమించారు. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. కానీ, మేము అలా చేయము. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ ఎన్నికలకు ముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారిలో మీ మద్దతు ఎవరికో తెలియజేయాలని ఆప్ ప్రజలను కోరడం తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు భగవంత్ మాన్ ను ఎంపిక చేసింది.

More Telugu News