T20 World Cup: మాకో చెత్త కెప్టెన్ ఉన్నాడంటూ పాక్ సారథి బాబర్ పై షోయబ్ అక్తర్ విమర్శలు

  • జింబాబ్వే చేతిలో ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దిగ్గజ పేసర్
  • కెప్టెన్, మేనేజ్ మెంట్ తీరుపై విమర్శలు
  • ఆదివారం నెదర్లాండ్స్ తో ఆడనున్న పాక్
Have A Bad Captain says Shoaib Akhtar Fumes After Pakistans Shock Defeat

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్.. తర్వాతి పోరులో చిన్న జట్టు జింబాబ్వే చేతిలో ఓడి మరో అవమానాన్ని మూటగట్టుకుంది. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలే పాక్ చేతులెత్తేసింది. చివరి ఓవర్లో దెబ్బకు తడబడిన పాక్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ పై విశ్లేషణ చేసిన పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్.. జట్టు ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  జట్టు వ్యూహాలను తప్పుబట్టడంతో పాటు బాబర్ ఆజం చెత్త కెప్టెన్ అని విమర్శించాడు. 

‘మన టాప్, మిడిలార్డర్ తో పెద్ద విజయాలు సొంతం చేసుకోవచ్చని నేను పదే పదే చెబుతున్నా. అయినా ఇది ఆటగాళ్లకు ఎందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదు. మనం నిలకడగా విజయాలు సాధించడం లేదు. పాకిస్థాన్ కు చెత్త కెప్టెన్ ఉన్నాడు. ప్రపంచ కప్ నుంచి  పాక్ నిష్క్రమించింది. మేం ఓడిపోయిన మూడు మ్యాచ్ ల్లో నవాజ్ చివరి ఓవర్ వేశాడు’ తన యూట్యూడ్ చానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. 

కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సిన అవసరం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘బాబర్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయాలి. షాహీన్ షా అఫ్రిదిలో ఫిట్ నెస్ లోపించింది. చెత్త కెప్టెన్సీ, మేనేజ్మెంట్ తీరు జట్టులోని పెద్ద లోపాలు. మేం మీకు మద్దతు ఇస్తాము. కానీ మీరు ఏరకమైన క్రికెట్ ఆడుతున్నారు?.  కేవలం అవతలి జట్టు చేతిలో ఓడిపోయేందుకే మీరు టోర్నీమెంట్ కు వెళ్లకూడదు కదా’ అని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కాగా, సూపర్12 గ్రూప్2లో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్ లో పాక్ ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందులో ఓడితే పాక్ అయితే ప్రపంచ కప్  నుంచి నిష్ర్కమిస్తుంది.

More Telugu News