India: పర్యవసానాలు తప్పవని పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

  • పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి సొంతం చేసుకుంటామన్న రాజ్ నాథ్ 
  • భారత్ కు పాక్ వెన్నుపోటు పొడిచిందని మంత్రి విమర్శ 
  • ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలపై పాక్ దౌర్జన్యం చేస్తోందని వ్యాఖ్య 
  • దీనికి పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక
Rajnath Singh hints at taking back Pakistan occupied Kashmir

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ ను తిరిగి సొంతం చేసుకుంటామని చెప్పారు. భారత్ ను పాక్ వెన్ను పోటు పొడిచిందని, ఆక్రమించిన కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని అన్నారు. పాకిస్థాన్ తన చర్యల పర్యవసానాలను చవిచూడాల్సి వస్తుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని కొన్ని భాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం విజయ్ దివాస్ సందర్భంగా మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత గిల్గిత్, బాల్టిస్థాన్ హస్తగతం చేసుకున్న తర్వాత జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. 

‘మేము జమ్మూ కశ్మీర్, లడఖ్‌లలో మా అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాము. గిల్గిత్, బాల్టిస్థాన్ లకు తిరిగి సొంతం చేసుకున్నప్పుడు మా లక్ష్యాన్ని సాధిస్తాము. మా సాయుధ బలగాల త్యాగం వల్ల కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. పీఓకేలో కశ్మీరీల బాధను మేము అనుభవిస్తున్నాం. మేము కశ్మీర్ అభివృద్ధిని ప్రారంభించాము. గిల్గిత్, బాల్టిస్థాన్ చేరే వరకు ఆగేది లేదు’ అని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. కశ్మీరియత్ పేరుతో లష్కరే ఉగ్రవాదులను పాకిస్థాన్ భారత్‌లోకి ప్రవేశపెడుతోందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, భారత్‌ను టార్గెట్ చేయడమే ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

More Telugu News