Ksenia Sobchak: అరెస్ట్ భయంతో రష్యాను వీడిన పుతిన్ రాజకీయ గురువు కుమార్తె

  • ఓ కేసులో సెనియా సహోద్యోగిని నిర్బంధించిన పోలీసులు
  • ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న సెనియా
  • 2018 ఎన్నికల్లో పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ
  • అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో రష్యాను వీడిన వైనం
Russian Journalist Ksenia Sobchak leaves Flees To Lithuania

ఉక్రెయిన్‌తో కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది. దీంతో చాలామంది రష్యా పౌరులు దేశాన్ని వీడుతున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది రష్యాను వీడారు. ఈ నేపథ్యంలో పుతిన్ రాజకీయ గురువైన అనటోలి సొబ్‌చాక్ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్ అయిన సెనియా సొబ్‌చాక్ (40) రష్యాను వీడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆమె సహోద్యోగిని నిర్బంధించిన పోలీసులు సెనియా ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు. 

నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సెనియా తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను పలుమార్లు బహిరంగంగానే ప్రశ్నించారు. 2012 ఎన్నికలకు ముందు క్రెమ్లిన్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఆమె 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేసి 2 శాతం ఓట్లు సాధించారు. ఆ తర్వాత విపక్ష నేతలతో పుతిన్ నిర్వహించిన భేటీకి కూడా ఆమె హాజరయ్యారు. 

సెనియా పనిచేస్తున్న మీడియా సంస్థ డైరెక్టర్‌ను ఓ కేసులో పోలీసులు నిర్బంధించారు. ఆ తర్వాత సెనియా నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆమె అరెస్ట్ ఖాయమన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన సెనియా తమ మీడియా సంస్థపై కక్షతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా, ఆమె రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.

More Telugu News