Gas leak: భోపాల్ లో గ్యాస్ లీక్ కలకలం

  • పదిహేను మందికి అస్వస్థత
  • స్పృహ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు
  • ప్రాణాపాయం లేదని ప్రకటించిన వైద్యులు
  • భయపడాల్సిందేమీ లేదన్న అధికారులు
Panic In Bhopal After Chlorine Gas Leak

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో విషవాయువుల లీక్ కలకలం సృష్టించింది. నగరంలోని ఓ నీటి శుద్ధి కేంద్రంలో గ్యాస్ లీక్ అయింది. దానికి మరమ్మత్తులు చేస్తుండగానే మరోసారి లీక్ కావడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అర్ధగంటలోనే లీకేజీని అరికట్టామని అధికారులు వెల్లడించారు. కాగా, 1984లో జరిగిన భోపాల్ విపత్తు గురించి తెలిసిందే. నగరంలోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువులు లీక్ కావడం, ఆ వాయువును పీల్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది ఇప్పటికీ అనారోగ్యాలతో బాధపడుతున్నారు.

భోపాల్ లోని మదర్ ఇండియా కాలనీలో నీటి శుద్ధి కేంద్రం ఉంది. బుధవారం మధ్యాహ్నం ఇందులో నుంచి క్లోరిన్ వాయువు లీక్ అయ్యింది. ఈ వాయువు పీల్చిన చుట్టుపక్కల జనం దగ్గు, ఆయాసంతో బాధపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. అప్పటికే స్థానికులలో పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు చిన్నారులు స్పృహ కోల్పోయారు. అధికారులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లీకేజీని అరికట్టడానికి మరమ్మతులు చేస్తుండగానే మరోసారి క్లోరిన్ లీక్ అయ్యింది. దీంతో మదర్ ఇండియా కాలనీ వాసుల్లో భయాందోళన వ్యక్తమైంది. అయితే, కాసేపటికే మరమ్మతులు పూర్తి చేసి లీకేజీని అడ్డుకున్నామని అధికారులు ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని స్థానికులకు భరోసా ఇచ్చారు.

More Telugu News