Shivaji: కరెన్సీ నోట్లపై శివాజీ బొమ్మ.. బాగుందంటూ బీజేపీ నేత ట్వీట్

  • కేజ్రీవాల్ డిమాండ్ కు మహారాష్ట్ర నేత కౌంటర్
  • రూ. 200 నోటు ఫొటోతో ట్వీట్ చేసిన లీడర్
  • భారత దేశం లౌకిక దేశమని గుర్తుచేసిన ఎమ్మెల్యే
Shivaji on Currency Note photg tweeted by Maharashtra Leader

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి ఫొటోలు ముద్రించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత ఒకరు స్పందించారు. నోట్లపైన మిగతా వారికంటే మరాఠా పోరాటయోధుడు, శివాజీ చక్రవర్తి ఫొటోనే బాగుంటుందని ట్వీట్ చేశారు. ఈమేరకు రూ. 200 నోటుపై శివాజీ బొమ్మ ఉన్న ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. బీజేపీ లీడర్, కంకావ్లీ ఎమ్మెల్యే నితీశ్ రాణె ఈ ట్వీట్ చేశారు.

అంతకుముందు కేజ్రీవాల్ డిమాండ్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు స్పందించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ద‌ృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఢిల్లీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. తనపై, తన పార్టీపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి కేజ్రీవాల్ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. రామ మందిర నిర్మాణానికి అడ్డుచెప్పిన కేజ్రీవాల్ ఇప్పుడు కొత్త ముసుగు తొడుక్కుని హిందువులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ విమర్శించారు.

‘ఇప్పటికైతే ఒక్క కేజ్రీవాలే హనుమాన్ చాలీసా చదువుతున్నాడు.. కొద్ది రోజులు ఆగితే ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చూడొచ్చు’అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అర్వింద్ కేజ్రీవాల్ టీవీ ఇంటర్వ్యూలో హనుమాన్ చాలీసా చదివిన విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిపాదన బాగుంది కానీ ఒక లౌకిక దేశంగా భారత్ లో కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించలేమని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ వ్యాఖ్యానించారు.

More Telugu News