Bandi Sanjay: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై స్పందించిన బండి సంజయ్.. యాదాద్రిలో ప్రమాణానికి సిద్ధమన్న బీజేపీ చీఫ్

  • మునుగోడు ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ తప్పదని కేసీఆర్ గ్రహించారన్న బండి సంజయ్
  • ఢిల్లీ వేదికగానే స్క్రిప్ట్ రాశారన్న బీజేపీ చీఫ్
  • సీఎం కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచిందని ఆరోపణ
Bandi Sanjay responded on TRS MLAs Horse trading issue

టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ కొందరు ప్రలోభాలకు గురిచేయడం, నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరిగిందని, కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడే దీనిని రాశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని భావించి కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు. బండి సంజయ్ గత రాత్రి మీడియాతో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు స్వామీజీని పిలిపించుకుని మాట్లాడారని, అప్పుడే ఈ స్క్రిప్ట్ రాశారని ఆరోపించారు. ఈ డ్రామాతో తమకు సంబంధం లేదని యాదాద్రిలో ప్రమాణం చేసే దమ్ము ఉందా? అని కేసీఆర్‌కు సవాలు చేశారు. యాదాద్రికి తమ తరపున ఎవరిని కోరితే వారే వస్తారని, టైం, తేదీ చెప్పాలని అన్నారు.

సీసీటీవీ ఫుటేజీలు విడుదల చేయాలి
ఈ వ్యవహారం మొత్తం ప్రగతి భవన్ వేదికగా నడిచిందని, సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ ఆడిన డ్రామాలు విఫలం కావడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సీన్లను పోలీసులు ముందే రికార్డు చేసి పెట్టుకున్నారని అన్నారు. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌లో నాలుగు రోజుల సీసీటీవీ ఫుటేజీలతోపాటు ప్రగతి భవన్‌లోని ఫుటేజీలు బయటపెడితే సీఎం ఆడుతున్న డ్రామా బయటపడుతుందని అన్నారు. మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడొకరు ప్రతి రోజూ ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి రాత్రి వస్తున్నారని అన్నారు. 

అర్ధ రూపాయికి కూడా చెల్లని వారికి కోట్ల రూపాయలా?
ఆ నలుగురు ఎమ్మెల్యేల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనరని, అలాంటిది రూ. వంద కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాతే డ్రామా ఆడుదామని అనుకున్నారని, కానీ ముందుగానే అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. అలాగే, స్వామీజీలు, నందకుమార్, ఎమ్మెల్యేల మూడు రోజుల కాల్‌డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన ఓ నాయకుడితో బెంగళూరులో బేరసారాలు జరిగాయని అన్నారు. నందకుమార్ గుట్కా వ్యాపారి అని, ఆ ఫాం హౌస్ గుట్కా వ్యాపారానికి అడ్డా అని ఆరోపించారు. అహంకారం తలకెక్కి బీజేపీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ హెచ్చరించారు.

More Telugu News