BJP: దత్తత గ్రామం సందర్శనకు ఏపీకి వస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

  • పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంకను దత్తత తీసుకున్న నిర్మల
  • దత్తత గ్రామంతో పాటు మత్స్యపురం గ్రామాన్ని సందర్శించనున్న కేంద్ర మంత్రి
  • గురువారం రాత్రి కాకినాడలో బస చేయనున్న వైనం
  • శుక్రవారం కాకినాడ, విశాఖల్లో పలు కార్యక్రమాలకు హాజరు
  • శనివారం విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం
union minister nirmala sitharaman will visit her adopted village in west godavari district tomorrow

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (గురువారం) ఏపీ పర్యటనకు వస్తున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైనవాని లంకను నిర్మల దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన దత్తత గ్రామ సందర్శన కోసమే ఆమె ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెదమైనవాని లంకలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమ్యూనిటి సెంటర్ ను ఆమె సందర్శించనున్నారు. తన దత్తత గ్రామ సందర్శనకు ముందు ఆమె జిల్లాలోని మత్స్యపురం గ్రామాన్ని కూడా సందర్శించనున్నారు.

రేపు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న నిర్మల... అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురం గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను పరిశీలించిన అనంతరం ఆమె నర్సాపూర్ మీదుగా పెదమైనవాని లంకకు చేరుకుంటారు. పెదమైనవాని లంక పరిశీలన అనంతరం నర్సాపూర్ మీదుగా ఆమె కాకినాడ చేరుకుంటారు. రేపు రాత్రికి కాకినాడలో బస చేయనున్న నిర్మల... శుక్రవారం కాకినాడతో పాటు విశాఖల్లో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. శుక్రవారం రాత్రి విశాఖలోనే బస చేయనున్న మంత్రి శనివారం తిరిగి ఢిల్లీ వెళతారు.

More Telugu News