dalit youth: భార్యను వేధించాడని పక్కింటి వ్యక్తిని కాల్చి చంపేశాడు..

  • అడ్డొచ్చిన ముసలి తల్లిదండ్రులపైనా కాల్పులు
  • మధ్యప్రదేశ్ లో దళిత కుటుంబంపై దారుణం
  • ముగ్గురి హత్య, చావుబతుకుల్లో మరో యువకుడు
Dalit Man Accused Of Harassing Woman Shot Dead His Parents Killed Too

తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో పక్కింటి యువకుడితో భర్త గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహం పట్టలేక దళిత యువకుడిపై కాల్పులు జరిపాడు. యువకుడి తల్లిదండ్రులు, తమ్ముడిపైనా నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు చనిపోగా.. ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లా దేవ్రాన్ గ్రామంలో మంగళవారం దళిత కుటుంబంపై చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు..

దేవ్రాన్ గ్రామానికి చెందిన జగదీశ్ పటేల్, మనాక్ ఆహిర్వార్ లు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు. జగదీశ్ తన భార్యతో కలిసి ఉంటుండగా.. మనాక్ తల్లిదండ్రులు, తమ్ముడితో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య తగాదా మొదలైంది. మనాక్ ప్రవర్తన బాలేదని, తనను వేధిస్తున్నాడని జగదీశ్ భార్య ఆరోపించడంతో మొదలైన వివాదం కలబడేదాక వెళ్లింది. గ్రామస్థులు కలగజేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి సద్దుమణిగింది. 

మరుసటి రోజు ఉదయం జగదీశ్ నలుగురిని వెంటేసుకుని నాటు తుపాకీతో సహా పలు ఆయుధాలను పట్టుకుని మరీ మనాక్ ఇంట్లోకి వెళ్లాడు. మరోమారు మనాక్ తో గొడవ పడుతూ ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో మనాక్ కిందపడిపోగా.. మనాక్ తల్లిదండ్రులు, తమ్ముడిపైనా జగదీశ్ కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో మనాక్, ఆయన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. మనాక్ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వైద్యులు చెప్పారు. గ్రామస్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న జగదీశ్ పటేల్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News