Air pollution: ఇలాంటి గాలితో బతికేదెట్టా..? గుండెకు పెద్ద ప్రమాదమే.. వైద్యుల హెచ్చరిక

  • గాలిలో పెరిగిపోతున్న పీఎం 2.5
  • అత్యంత ప్రమాదకర స్థితికి చేరిక
  • ఊపిరితిత్తులకే కాదు, గుండెకూ పెద్ద ప్రమాదమే
  • ఈ కాలుష్యాలు రక్తంలోకి చేరడం వల్ల గుండె జబ్బులు
Experts say Air pollution likely to increase not only lung disease but heart attack also

గాలి కాలుష్యం పట్ల దేశ ప్రజలకు ఏ మాత్రం స్పృహ ఉండడం లేదు. ఒకవైపు పెద్ద ఎత్తున మోటారు వాహనాల వినియోగం, మరోవైపు చెట్లు నరకడం ఇలా ఎన్నింటినో చెప్పుకోవాల్సి వస్తుంది. ఏటా దీపావళి సందర్భంగా వెలువడే వాయు కాలుష్యం భారీ స్థాయిలో ఉంటోంది. సాధారణ క్రాకర్స్ తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ వెలువరించే కాలుష్యం తక్కువ. అయినా కానీ, మన ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు.

దీపావళి క్రాకర్స్ ఫలితంగా.. మంగళవారం ఉదయం ఢిల్లీలో వాయు కాలుష్యం పీఎం 2.5 326 స్థాయికి చేరినట్టు కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. ముంబైలో 193గా ఉంది. చెన్నైలో 230కి పెరిగిపోయింది. తుఫాను గాలులు, వర్షం వల్ల పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా (37), హౌరా (36)లో వాయు కాలుష్యం చాలా తక్కువగా నమోదైంది. 

వైద్యుల ఆందోళన..
ఢిల్లీలో విషపూరితమైన గాలి పీలుస్తున్నట్టు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అకోశ్ సేత్ పేర్కొన్నారు. ‘‘ఊపిరితిత్తుల వ్యాధులైన ఆస్తమా మరింత పెరిగిపోయేందుకు వాయు కాలుష్యమే కారణం. వాయు కాలుష్యం గుండెను దెబ్బతీస్తుందన్న వాస్తవాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా యువతలోనూ గుండె జబ్బులను చూస్తున్నాం. దీనికి వాయు కాలుష్యమే కారణమన్నది నా అభిప్రాయం. గడిచిన  20 ఏళ్లలో వాయు కాలుష్యం మరింత పెరిగిపోవడమే కాకుండా, జీవన శైలిలోనూ మార్పు వచ్చింది. గత 20 ఏళ్లలో కార్డియాలజీకి సంబంధించి అన్ని అధీకృత సైంటిఫిక్ బాడీలు దీన్ని గుర్తించాయి’’అని సేత్ తెలిపారు.

వాయు కాలుష్యం గుండె కణజాలంలో వాపు (ఇన్ ఫ్లమ్మేషన్)నకు కారణమవుతుందని డాక్టర్ అశోక్ సేత్ అంటున్నారు. ‘‘పార్టిక్యులేటర్ మ్యాటర్ 2.5 ఎంతో హానికారకం. ఊపిరితిత్తుల నుంచి రక్త నాళాల్లోకీ వెళుతుంది. ఇది కేవలం ధూళికణమే కాదు. గ్యాసియస్ మెట్రిక్. అంటే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్ తో ఉంటుంది. ఇవన్నీ హానికారకాలే. గుండె ధమనుల్లో వాపును కలిగిస్తాయి. పీఎం 2.5 రక్త నాళాల్లోకి వెళ్లడం వల్ల ధమనుల్లో కేవలం వాపు మాత్రమే కాకుండా, రక్తం గడ్డ కట్టే రిస్క్ ఏర్పడుతుంది. హార్ట్ ఎటాక్ రావడానికి ఈ రెండు ముఖ్యమైనవి.  అలాగే, ఆర్టరీల లోపలి లైనింగ్ దెబ్బతినడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీస్తుంది. రక్తంలో ఈ కాలుష్యాలు చేరడం వల్ల గుండె స్పందనల క్రమం (రిథమ్) మారిపోయి గుండె రేటుపై ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణానికి కారణమవుతుంది. 

హైదరాబాద్ లోనూ పరిస్థితి దారుణమే
భాగ్యనగరంలో పీఎం 2.5 స్థాయి 71కు చేరినట్టు ఇటీవలే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించడం గమనార్హం. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గరిష్ట పరిమితి 5 కంటే ఇది 14 రెట్లు అధికం.

More Telugu News