Bangladesh: బంగ్లాదేశ్‌లో ముగ్గురిని బలితీసుకున్న ‘సిత్రాంగ్’.. 2.19 లక్షల మందిని ఖాళీ చేయించిన అధికారులు

  • బంగ్లాదేశ్‌లోని తూర్పు ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్న తుపాను
  • 6,925 తుపాను కేంద్రాల ఏర్పాటు
  • కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు
  • తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Cyclone Sitrang kills 3 in Bangladesh

‘సిత్రాంగ్’ తుపాను బంగ్లాదేశ్‌లో ప్రభావం చూపుతోంది. భోలా, నారియల్ జిల్లాల్లో విరుచుకుపడుతోంది. భోలా జిల్లాలోని దౌలత్‌ఖాన్, నారియల్ జిల్లాలోని చర్ఫాషాన్‌లలో చెట్లు కూలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తుపాను కారణంగా పలువురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, 6,925 తుపాను కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావానికి గురైన చివరి వ్యక్తి కూడా ఆశ్రయం పొందేలా ఏర్పాటు చేశామన్నారు. 

సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాల నుంచి 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. తుపాను తీరం దాటినప్పుడు అలలు ఎగసిపడతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు, వారికి అత్యవసరాలైన ఆహారం, మందులు, నీళ్లు, టార్పాలిన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News