Dirty Bomb: ఉక్రెయిన్ ప్రమాదకర 'డర్టీ బాంబ్' రూపొందిస్తోందన్న రష్యా... ఖండించిన జెలెన్ స్కీ

  • ఉక్రెయిన్ పై రష్యా ఆరోపణలు
  • రేడియో ధార్మికతను వ్యాపింపజేసే 'డర్టీ బాంబ్'
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా
  • రష్యన్లే డర్టీ బాంబ్ ను రూపొందించి ఉంటారన్న జెలెన్ స్కీ
  • అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్
Russia alleges Ukraine prepares Dirty Bomb

ఉక్రెయిన్ తమ బలగాలపై రేడియో ధార్మిక పదార్థాలను వెదజల్లే ప్రమాదకర 'డర్టీ బాంబ్' ను ప్రయోగించే అవకాశాలున్నాయని రష్యా ఆరోపించింది. బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ దేశాల సాయంతో ఉక్రెయిన్ ఈ రేడియో ధార్మిక 'డర్టీ బాంబ్' ను తయారుచేస్తోందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. 'డర్టీ బాంబ్' పేరిట ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. 

అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. ఉక్రెయిన్ ప్రమాదకర దాడికి సిద్ధమవుతోందని రష్యా ఆరోపణలు చేస్తోందంటే, రష్యా ఇప్పటికే ఆ బాంబును సిద్ధం చేసుకుని ఉంటుందని జెలెన్ స్కీ ప్రత్యారోపణలు చేశారు. రష్యన్లు 'డర్టీ బాంబ్' ను ఇప్పటికే తయారు చేసుకుని, తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు దీనిపై గట్టిగా స్పందించాలని కోరారు. 

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పందిస్తూ, రష్యా ఆరోపణలు అసంబద్ధం, ప్రమాదకరం అని పేర్కొన్నారు. తమ వద్ద ఎలాంటి డర్టీ బాంబులు లేవని, వాటిని సమకూర్చుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆయుధాలను సిద్ధంగా ఉంచుకునేది రష్యన్లే అని, వారు ఇతరులపై ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు.

More Telugu News