Rishi Sunak: చరిత్ర సృష్టించిన రిషి సునాక్... బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవం

  • నేడు నామినేషన్లకు తుదిగడువు
  • పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ మోర్డాంట్
  • రేసులో రిషి సునాక్ ఒక్కరే మిగిలిన వైనం
  • సునాక్ కు 188 మంది ఎంపీల బలం
  • మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు
Rishi Sunak unanimously elected as Britain new prime minister

రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ చరిత్రలో ఓ ఆసియా సంతతి వ్యక్తి తొలిసారిగా ప్రధాని పీఠం అధిష్ఠించనున్నారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవం అయ్యారు. ప్రధాని రేసులో నిలిచిన పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ను ప్రధాని పదవి వరించింది. 

ఇవాళ కన్జర్వేటివ్ పార్టీ అధినేత ఎన్నికల నామినేషన్లకు తుది గడువు కాగా, అందుకు కొన్ని నిమిషాల ముందు తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు పెన్నీ మోర్డాంట్ ప్రకటించారు. దాంతో, ప్రధాని రేసులో రిషి సునాక్ ఒక్కరే మిగిలారు. పోటీ ఎవరూ లేకపోవడంతో బ్రిటన్ ప్రధానిగా ఆయనే ఎన్నికయ్యారు.

రిషి సునాక్ కు 188 మంది ఎంపీల మద్దతు ఉండగా, మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు ఉంది. కనీసం 100 మంది ఎంపీల మద్దతు కూడా కూడగట్టలేకపోవడంతో మోర్డాంట్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్... లిజ్ ట్రస్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. విచారకర రీతిలో లిజ్ ట్రస్ 45 రోజులకే ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో, మళ్లీ రేసులోకి వచ్చిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి సునాక్ జోరు ముందు నిలవలేకపోయారు. 

కాగా, ఈ పరిణామాలపై బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు జరపాల్సిందేనంటూ పునరుద్ఘాటించింది. అటు, ఈ నెల 28న రిషి సునాక్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

More Telugu News