T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్

  • దాయాదుల పోరుకు సర్వం సిద్ధం
  • ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్
  • రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్
  • ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు
ICC T20 World Cup Big Fight between India and Pakistan

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములకంటే అది పంచే మజాపైనే అభిమానులు ఎక్కువగా దృష్టిసారిస్తారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఉన్న రికార్డు మరే దేశానికి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆ రికార్డును కాపాడుకోవాలని పట్టుదలగా ఉండగా, నేటి మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ఆ రికార్డును బద్దలుగొట్టాలని బాబర్ ఆజం సేన కసిగా ఉంది. 

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన భారత్.. ప్రతికారేచ్ఛతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ పూర్తి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ భారత్‌ను ఒకసారి చిత్తు చేసిన పాకిస్థాన్ నేటి మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని పథకం వేసింది. గతంతో పోలిస్తే పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ ఓ ప్రణాళిక ప్రకారం ఆడాల్సి ఉంటుంది. అలాగే, గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది. 

విరాట్ బ్యాట్ ఝళిపిస్తే..
ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లీ అదే జోరు కొనసాగిస్తే భారత్‌ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. దీనికి తోడు సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ భారత్‌కు అదనపు బలం. ఎలాంటి బౌలింగునైనా చిత్తుగా కొట్టే సూర్యకుమార్ బ్యాట్‌కు పనిచెబితే ఇండియా విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. పాకిస్థాన్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉండడం ఇక్కడ కలిసొచ్చే మరో అంశం.

ఆ ఇద్దరినీ వెనక్కి పంపితేనే..

పాకిస్థాన్ విషయానికి వస్తే.. కెప్టెన్ బాబర్ ఆజం ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులో పాతుకుపోవడంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌‌కు మించినోడు లేడు. ఈ ఇద్దరిని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపించామన్న దానిపైనే భారత్ విజయం ఆధారపడి ఉంటుంది. గతేడాది ప్రపంచకప్‌లో వీరిద్దరే క్రీజులో పాతుకుపోయి వికెట్ నష్టపోకుండా 150కిపైగా పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేశారు. వీరిద్దరూ విఫలమైన మ్యాచ్‌లలో పాక్ బోల్తాపడింది. కాబట్టి భారత బౌలర్లు వీరిపైనే ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఆ జట్టులో షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్లికార్ అహ్మద్, అసిఫ్ అలీ, షాబాద్, నవాజ్ వంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ నిలకడలేమి వారిని వేధిస్తోంది. అలాగని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, గతేడాది భారత్‌ను భయపెట్టిన అత్యంత ప్రమాదకర బౌలర్ షహీన్ ఆఫ్రిదిని జాగ్రత్తగా ఎదుర్కోగలిగితే భారత్‌ విజయానికి ఢోకా ఉండదు.

ఏ ఇద్దరు ఫామ్‌లోకి వచ్చినా..
భారత జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించే  రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ బ్యాట్ల నుంచి గత కొంతకాలంగా పరుగులు రావడం లేదు. కోహ్లీ ఇటీవల ఫామ్‌లోకి వచ్చినప్పటికీ రోహిత్, రాహుల్ కూడా ఫామ్‌లోకి వస్తే అది భారత్ అభిమానులకు పండుగే అవుతుంది. వీరిలో ఏ ఇద్దరు ఆడినా భారత్‌కు తిరుగుండదు. ఆ తర్వాతి పనిని చూసుకునేందుకు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. 

దినేశ్ కార్తీకా? రిషభ్ పంతా?
ఇక, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులుగా అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌కు చోటిస్తే అదనపు బలం చేకూరుతుంది. బౌలర్ల విషయానికి వస్తే షమీని తుది జట్టులోకి తీసుకుంటారా? లేదంటే హర్షల్ పటేల్‌కు చాన్స్ ఇస్తారా? అన్నది జట్టు కూర్పు తర్వాత కానీ తెలియదు. భువనేశ్వర్ కుమార్ బంతితో చెలరేగాల్సి ఉంటుంది. ఇక స్పిన్నర్లలో చాహల్, అశ్విన్‌లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

More Telugu News