Pawan Kalyan: విశాఖలో అక్రమాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే మా వాళ్లపై తప్పుడు కేసులు: పవన్ కల్యాణ్

  • ఇటీవల విశాఖలో రగడ
  • జనసేన నేతలపై కేసులు, అరెస్ట్
  • 9 మందికి బెయిల్ వచ్చిందన్న పవన్ 
  • విశాఖ అక్రమార్కులు ఎవరో అందరికీ తెలుసని వెల్లడి
Pawan Kalyan opines after Janasena leaders got bail and released

విశాఖపట్నంలో ఇటీవల అరెస్టయిన 9 మంది జనసేన నేతలకు బెయిల్ లభించడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఇవాళ బెయిల్ మీద బయటికి రావడం సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. 

ఆ నేతలు జైల్లో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసని పవన్ కల్యాణ్ అన్నారు. జైల్లో ఉన్న నేతల కోసం న్యాయపోరాటం చేసిన పార్టీ లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. 

విశాఖలో అక్రమాలు, తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నది ఎవరో నగర ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పవన్ పేర్కొన్నారు. ఈ వాస్తవాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే జనసేన నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 

అందులో భాగంగానే, జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్ పోర్టులో ప్రభుత్వ ప్రాయోజిత డ్రామా సృష్టించారని వివరించారు. అక్కడి ఘటనల్లో తమ పార్టీ నేతలు, వీర మహిళలను, జనసైనికులను ఇరికించారని తెలిపారు. నియమ నిబంధనలకు నీళ్లొదలి అరెస్టులకు పాల్పడ్డారని, మహిళలని కూడా చూడకుండా అర్థరాత్రి వేళ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 

ఈ అంశంపై కచ్చితంగా న్యాయపోరాటం చేయాలని, అందుకు అనుగుణంగా కేసులు దాఖలు చేయాలని పార్టీ లీగల్ సెల్ సభ్యులకు సూచించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

More Telugu News