Janasena: విశాఖ జైలు నుంచి జనసేన నేతల విడుదల

  • విశాఖలో వైసీపీ నేతలపై దాడి ఘటనలో అరెస్టయిన జనసేన నేతలు
  • నిందితులకు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందాక వారిని విడుదల చేసిన విశాఖ జైలు అధికారులు
janasena leaders released from jail

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలు శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. విశాఖ గర్జనకు హాజరైన వైసీపీ నేతలు తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా... అదే సమయంలో విశాఖకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జన సైనికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల కార్లపై వారు దాడికి దిగారు. ఈ కేసులో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా...వారిలో 61 మందికి స్థానిక కోర్టు ఆ రోజే బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా... వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను స్థానిక కోర్టు కొట్టివేయగా... తాజాగా వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు.

More Telugu News