Zimbabwe: టీ20 ప్రపంచకప్: చరిత్రలోనే తొలిసారి సూపర్-12కు జింబాబ్వే

  • ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీలోనూ ఆడని జింబాబ్వే
  • స్కాంట్లాడ్‌పై అద్భుత విజయం సాధించి రెండో దశలోకి
  • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన క్రెయిగ్ ఇర్విన్
zimbabwe Enters second stage of t20 world cup first time

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాక్ ఇవ్వగా, నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. రెండు టీ20 ప్రపంచకప్‌లను ముద్దాడిన విండీస్‌కు ఇది ఊహించని షాకే. కాగా, నిన్న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే తొలిసారి టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది. 

ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీ కూడా ఆడని జింబాబ్వే ఈసారి మాత్రం చక్కటి ఆటతీరుతో తొలిసారి ప్రపంచకప్ రెండో దశలోకి ప్రవేశించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాలు మొదలెట్టేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ 54 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేయగా, సికందర్ రజా 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News