Liz Truss: ప్రధానిగా పనిచేసింది 45 రోజులే... అయినా, లిజ్ ట్రస్ కు అదిరిపోయే పెన్షన్ ప్యాకేజి

  • ఎన్నికైన కొన్నిరోజులకే లిజ్ ట్రస్ రాజీనామా
  • బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం
  • మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ కు ఏటా రూ.1 కోటి
  • 1990 నుంచి మాజీ ప్రధానులకు పెన్షన్ స్కీం అమలు
Britain former prime minister Liz Truss will draw one crore rupees annually

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ప్రస్థానం 45 రోజులకే ముగిసింది. ప్రజామోదం లేని ఆర్థిక విధానాలతో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న లిజ్ ట్రస్ చివరికి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడామె మాజీ ప్రధాని... ప్రధాని పదవిలో ఉన్నది కేవలం 45 రోజులే... అయితేనేం, ఆమెకు లభించే పదవీ విరమణ అనంతర భృతి అదరహో అనిపించేలా ఉంది. 

ఆమెకు మాజీ ప్రధాని హోదాలో ఏడాదికి రూ1.06 కోట్ల భత్యం లభించనుంది. జీవితకాలం పాటు లిజ్ ట్రస్ ఈ భృతి అందుకోనున్నారు. ప్రజా సంబంధ విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఈ చెల్లింపులు వినియోగించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ నిధులను రీయింబర్స్ మెంట్ విధానంలో చెల్లిస్తారు. 

1990లో ప్రధాని పదవి నుంచి మార్గరెట్ థాచర్ రాజీనామా తర్వాత ఈ భత్యం ఏర్పాటు చేశారు. ఈ భృతిని 1991లో అప్పటి బ్రిటీష్ ప్రధాని జాన్ మేజర్ ప్రకటించారు. అప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ స్కీం ద్వారా ఏటా కోటి రూపాయలకు పైగా పొందుతున్నారు. ఒకసారి ప్రధానిగా పనిచేస్తే, ప్రజల్లో వారికి ప్రత్యేకస్థానం ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి కార్యక్రమాల ఖర్చుల కోసమే ఈ భృతి అని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

ఇక, లిజ్ ట్రస్ కు ఈ వార్షిక భృతి మాత్రమే కాదు, పార్లమెంట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ నుంచి వ్యక్తిగత పెన్షన్ కూడా లభిస్తుంది. ఆమె పదవి నుంచి దిగిపోయే నాటికి ఎంత వార్షిక వేతనం అందుకునేవారో, అందులో సగం పెన్షన్ గా అందిస్తారు.

More Telugu News