Telangana: బీజేపీకి స్వామి గౌడ్ గుడ్ బై...ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ

  • తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా పనిచేసిన స్వామి గౌడ్
  • తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్ గానూ పనిచేసిన వైనం
  • 2020లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నేత
  • తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
swamy goud resigns bjp and will join in trs soon

తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా పనిచేసి, ఆ తర్వాత తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్ గా వ్యవహరించిన స్వామి గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే ఆయన ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన తిరిగి తన సొంత గూటికి చేరేందుకే బీజేపీకి వీడ్కోలు పలుకుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన స్వామి గౌడ్... ఉద్యమంలో ముందు వరుసలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యోగ సంఘాల నేతగా ఆయన పిలుపునకు ఉద్యోగుల నుంచి భారీ స్పందనే లభించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేందుకు రంగం సిద్ధమైన వేళ టీఆర్ఎస్ లో ఆయన చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన తెలంగాణ శాసన మండలికి తొలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 

2020 వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగిన స్వామి గౌడ్... టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాదాపుగా రెండున్నరేళ్లకు పైగానే బీజేపీలోనే ఉన్న స్వామి గౌడ్ ఎక్కడా కనిపించిన దాఖలా లేదు. తాజాగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ పట్ల బీజేపీ తీరు తనకు బాధ కలిగించిందన్నారు. ఈ కారణంగానే బీజేపీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు.
.

More Telugu News