Telangana: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయండి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో

  • ఈ ఎన్నికల్లో పార్టీలను చూడొద్దని నేతలకు వెంకట్ రెడ్డి సూచన
  • ఏ ఇబ్బంది వచ్చినా తాను చూసుకుంటానని భరోసా
  • ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ ను అవుతానన్న భువనగిరి ఎంపీ
  • పాదయాత్ర చేపట్టి సీఎంను అవుతానని వెల్లడి
  • ఆడియోపై స్పందించని వైనం
  • కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లినట్లు సమాచారం
komatireddy venkat reddy audio viral in social media

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగానే ఈ ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటిదాకా ప్రచారానికి హాజరు కాని... వెంకట్ రెడ్డి... తాజాగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారట. ఫోన్లలో జరిగిన ఈ సంభాషణకు చెందిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో పలువురు కాంగ్రెస్ నేతలతో వెంకట్ రెడ్డి మాట్లాడారు. పార్టీలను పక్కనపెట్టి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తానే చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

అలాగే, ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ ను అవుతానని కూడా అన్నారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని, రాష్ట్రానికి సీఎంను కూడా అవుతానని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఇప్పటిదాకా వెంకట్ రెడ్డి స్పందించలేదు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినట్లుగా సమాచారం. మరో 10 రోజుల పాటు ఆయన ఆస్ట్రేలియాలోనే ఉంటారని తెలుస్తోంది.

More Telugu News