moonlighting: ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్

  • వేరే సంస్థలో కాంట్రాక్టు పని చేసుకోవచ్చన్న కంపెనీ
  • ఇందుకు మేనేజర్, హెచ్ఆర్ నుంచి అనుమతి కోరాలని సూచన
  • తాత్కాలిక పని కల్పించే సంస్థ ఇన్ఫోసిస్ కు పోటీ కాకూడదన్న షరతు
After firing employees for moonlighting Infosys to allow employees to take up freelance work

మూన్ లైటింగ్ పేరుతో లోగడ ఉద్యోగులను తొలగించిన అగ్రగామి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల కోణం నుంచి ఆలోచిస్తోంది. ఫ్రీలాన్స్ పని చేసుకునేందుకు ఉద్యోగులను అనుమతించనుంది. మూన్ లైటింగ్ అంటే.. ఒక వ్యక్తి ఒక సంస్థలో అధికారికంగా పనిచేస్తూ, ఆ సంస్థకు తెలియకుండా మరో చోట మరొక ఉద్యోగం చేయడం. దీనివల్ల కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న వాదన అయితే ఉంది.

విప్రో కూడా ఇటీవలే మూన్ లైటింగ్ పేరుతో 300 మంది ఉద్యోగులను గుర్తించి తొలగించింది. ఇది అనైతికమని, దీన్ని సహించేది లేదని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఉద్యోగులను ఫ్రీలాన్స్ కు అనుమతించేందుకు ఇన్ఫోసిస్ ఎందుకు సానుకూలంగా ఉందన్న ప్రశ్న ఎదురుకావడం సహజం. వేరో చోట పార్ట్ టైమ్ పని చేసుకునేందుకు కుదరదని చెబితే.. అప్పుడు మంచి నైపుణ్యాలు ఉన్న వారు కూడా దూరం కావచ్చు. బహుశా ఇదే ఇన్ఫోసిస్ లో మార్పునకు కారణమై ఉంటుంది. 

ఫ్రీలాన్స్ కు అనుమతిస్తే, నిపుణుల వలసలను కొంత వరకు అడ్డుకునే అవకాశం లభిస్తుంది. ఐటీ రంగంలో ఇప్పుడు వలసలు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఏ కంపెనీ అయినా మెరుగైన ప్రయోజనాలు ఆఫర్ చేస్తే, మారు మాట్లాడకుండా అక్కడికే ఉద్యోగులు జారుకుంటున్నారు. 

అదనపు ఆదాయం కోసం చూసే ఉద్యోగులకు అందుకు వీలు కల్పించాలన్నది ఇన్ఫోసిస్ ఆలోచనగా తెలుస్తోంది. కాకపోతే ఇలా ఫ్రీలాన్స్ చేయాలనుకునే వారు ముందుగా కంపెనీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ‘‘ఏ ఉద్యోగి అయినా కాంట్రాక్టు పని చేపట్టాలనుకుంటే అది చేసుకోవచ్చు. కాకపోతే వారి మేనేజర్, బీపీ హెచ్ఆర్ నుంచి అనుమతి తీసుకోవాలి. వారికి తాత్కాలిక పని కల్పించే కంపెనీ.. ఇన్ఫోసిస్ తో కానీ, ఇన్ఫోసిస్ క్లయింట్లతో కానీ పోటీ పడకూడదు’’ అంటూ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో ఇన్ఫోసిస్ పేర్కొంది. పైగా ఇలా వేరే చోట కాంట్రాక్టు పని వల్ల, ఇన్ఫోసిస్ లో వారి పని సామర్థ్యాలు ప్రభావితం కాకూడదని, దీన్ని తాము సమీక్షిస్తుంటామని తెలిపింది.

More Telugu News