china: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై వ్యతిరేకత.. బాత్ రూమ్ గోడలపై పౌరుల నిరసన రాతలు

  • విచాట్ లో జనం నిరసన గళం
  • వాయిస్ ఆఫ్ సీఎన్ పేరుతో ఇన్ స్టా ఖాతా
  • దేశంలో ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్
  • పెద్ద నగరాలకు వ్యాపించిన ఆందోళనలు
  • నిరసనకారులపై అధికారుల నిఘా
protests againist xinping in china

జీరో కొవిడ్ పాలసీ పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అధ్యక్షుడు జిన్ పింగ్ పై చైనా పౌరుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి జిన్ పింగ్ ప్రయత్నాలు చేస్తుండడంపై అక్కడి జనం మండిపడుతున్నారు. జిన్ పింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కెమెరాల నిఘా ఉంటుంది కాబట్టి బాత్ రూమ్ గోడలపై నినాదాలు రాస్తున్నారు. బయట నినాదాలు చేసినా, ఎక్కడైనా రాసినా.. పట్టుబడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి ఉంటుందనే భయంతో తమ నిరసనను ఇలా వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం రోడ్లపై ఆందోళన చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభత్వం తీవ్రంగా స్పందించింది. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. నిరసనల విషయం బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టింది. 

మరోపక్క, ఈ నెల 13న బీజింగ్ లోని సైటోంగ్ బ్రిడ్జి వద్ద ఓ యువకుడు తన నిరసనను వినూత్నంగా తెలిపాడు. బ్రిడ్జిపై ఓ టైరును కాల్చి, బ్రిడ్జికి రెండు బ్యానర్లు వేలాడదీశాడు. అందులో నియంత, ద్రోహి జిన్ పింగ్ ను పదవి నుంచి తొలగించాలని రాశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు.. ఆ బ్యానర్లను తొలగించడంతో పాటు ఇంటర్నెట్ లోనూ పలు చర్యలు చేపట్టారు. బ్రిడ్జి, బ్యానర్, సైటోంగ్ తదితర కీ వర్డ్స్ ను కట్టడి చేసింది. ఆయా పదాలతో వెతికినా ఈ నిరసన ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

బీజింగ్ నగరంలోని చైనా ఫిలిం ఆర్కైవ్ ఆర్ట్ సినిమా హాల్ బాత్ రూమ్ లలో నియంతృత్వాన్ని తిరస్కరించండి అంటూ నినాదం రాశారు. గోడలపై నల్లరంగు పెయింట్ తో ఈ నినాదాలను గీశారు. చైనాలో ప్రజాస్వామ్యం కావాలంటూ కొంతమంది ప్రజలు వాయిస్ ఆఫ్ సీఎన్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతా తెరిచారు. అందులో జిన్ పింగ్ కు వ్యతిరేకంగా ఫొటోలు, నినాదాలు పోస్టు చేస్తున్నారు. 

బాత్ రూమ్ గోడలపై నినాదాల సంగతిని వాయిస్ ఆఫ్ సీఎన్ నిర్వాహకులే బయటకు వెల్లడించారు. ఇలాంటి ఫొటోలు తమకు చాలానే వస్తున్నాయని చెప్పారు. జిన్ పింగ్ వ్యతిరేక నిరసనలు బీజింగ్ సహా షాంఘై, హాంగ్ కాంగ్, షెంజెన్ తదితర నగరాలకు విస్తరించాయని వెల్లడించారు. విచాట్(చైనా సోషల్ మీడియా)లో జనం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.

More Telugu News