YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక మలుపు.. సీబీఐ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • సీబీఐ విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీత పిటిషన్
  • పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం
  • విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్న సీబీఐ
  • శుక్రవారం ఉత్తర్వులను వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు
Supreme Court agrees to change YS Vivekananda Reddy murder case CBI probe to other state

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం ఇస్తామని తెలిపింది. ఏపీలో ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని, సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దర్యాప్తు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతున్నారని... ఈ నేపథ్యంలో సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దాదాపు మూడు గంటల పాటు విచారించింది. 

మరోవైపు, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు... ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది. 

ఇదిలావుంచితే, హైదరాబాదుకు కేసును బదిలీ చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించగా... ఏపీకి దగ్గరగా హైదరాబాద్ ఉందని... అందువల్ల విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక సహా ఏ రాష్ట్రమైనా అభ్యంతరం లేదని తెలిపారు. విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలా? అనే ప్రస్తావన కూడా వాదనల సందర్భంగా రావడం గమనార్హం. ఈ క్రమంలో, కేసు విచారణను ఎక్కడకు బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం నాడు తమ తీర్పులో వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.

More Telugu News