Kiren Rijiju: న్యాయమూర్తులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కలకలం

  • పని మానేసి న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలనే దానిపై దృష్టి పెడుతున్నారని వ్యాఖ్య
  • కొలీజియం నియామక ప్రక్రియలో మార్పు రావాల్సిందేనని స్పష్టీకరణ
  • న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే ప్రక్రియ ప్రపంచంలో మన దగ్గర మాత్రమే ఉందన్న మంత్రి
  • 1998కి ముందు న్యాయమూర్తులను కేంద్రమే నియమించేదన్న కిరణ్ రిజిజు
Law minister Kiren Rijijus comments on judges collegium spark controversy

న్యాయమూర్తులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. న్యాయమూర్తులు కేసుల్లో తీర్పులు చెప్పడం మాని తమ సగం సమయాన్ని జడ్జీలుగా ఎవరిని నియమించాలన్న దానికే వృథా చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. 

కొలీజియం విధానం పారదర్శకంగా లేదంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొలీజియం ద్వారా జరుగుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పు రావాల్సిందేనని అన్నారు. అహ్మదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ‘పాంచజన్య’ నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్రంగా పరిగణిస్తున్నారు.

కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవన్నారు. కోర్టుల్లో కంటికి కనిపించని రాజకీయం జరుగుతోందన్నారు. న్యాయమూర్తులు న్యాయం చేయడానికి బదులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించాలని చూస్తే మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించాల్సి వస్తుందని చేసిన హెచ్చరికలపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావు లేదన్న మంత్రి.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే ప్రక్రియ ప్రపంచంలోనే ఎక్కడా లేదన్న ఆయన.. మన దగ్గరున్న ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించడం కేంద్రం బాధ్యత అని కిరణ్ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ న్యాయమూర్తులను నియమించేదని అన్నారు. అయితే, 1998లో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఫలితంగా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తున్నారని అన్నారు. ఎక్కువ మంది న్యాయమూర్తులు తమ విధులను పక్కనపెట్టేసి ఇతర న్యాయమూర్తులను నియమించడంపైనే దృష్టిపెడుతూ సగం కంటే ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గమనించానని పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో మార్పు రావాల్సిందేనని తేల్చి చెప్పారు.

More Telugu News